Dengue Alert in Telangana :రాష్ట్రంలో డెంగీ చాపకింద నీరులా విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5 వేల 372 మంది దీని బారిన పడ్డారు. రెండు నెలలుగా 4 వేల 294 నమోదయ్యాయి. డెంగీ నిర్ధారణకు జరుపుతున్న పరీక్షల్లో 6.5 శాతం పాజిటివిటీ ఉంటోంది. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి డెంగీ నిర్ధారణ అవుతోంది.
మరింతగా పెరుగుదల :అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదు కాగా తర్వాతి స్థానాల్లో సూర్యాపేట, మేడ్చల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలు ఉన్నాయి. సెప్టెంబరు నెలాఖరు వరకు డెంగీ కేసులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీగా కేసులు నమోదైనా డెంగీ మరణాలు లేవని వైద్యఆరోగ్యశాఖ చెబుతోంది. 152 మందికి చికెన్ గున్యా, 191 మందికి మలేరియా సోకినట్టు ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది.
నాలుగైదు రోజుల్లోనే విషమం :జులై నుంచి ఇప్పటి వరకు కోటి 42 లక్షల 78 వేల 723 నివాసాల్లో జ్వర సర్వే చేసినట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. డెంగీ బాధిత చిన్నారులతో నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, ఫీవర్ సహా జిల్లాల్లోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. బాధితుల్లో ఏడాదిన్నర నుంచి 12 ఏళ్ల వయసు పిల్లలు ఉంటున్నారు. పిల్లలకు ఈ కాలంలో జ్వరం వస్తే తొలుత డెంగీగానే అనుమానించి పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే నాలుగైదు రోజుల్లోనే పరిస్థితి విషమించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.