How To Register Aadhaar Card For Children In Telugu: తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. కొత్త రేషన్ కార్డులో తమ చిన్నారుల పేర్లు నమోదు చేయాలనే ఉద్దేశంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆధార్ కేంద్రాలకు తీసుకు వెళ్లి వివరాలు నమోదు చేయిస్తున్నారు. సరైన నిబంధనలు పాటించకపోవడంతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. చాలా మంది నిబంధనలు తెలుసుకోకుండా ఆధార్ కేంద్రాలకు పిల్లలకు తీసుకుకెళ్లడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లల ఆధార్ కార్డు తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పడు మనం తెలుసుకుందాం.
బర్త్ సర్టిఫికేట్ వివరాలే కీలకం : ఐదు సంవత్సరాలలోపు చిన్నారులకు ఆధార్ కార్డు నమోదు చేయాలంటే వారికి తప్పనిసరిగా డిజిటల్ పద్ధతిలో పొందిన జనన ధ్రువీకరణ పత్రం తప్పని సరిగా ఉండాల్సిందే. వాటిలో చిన్నారుల పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్ వివరాలు ఉంటాయి. ఇదే వివరాలు, చిరునామాలతో పిల్లల తల్లిదండ్రుల ఆధార్ కార్డులు ఉండాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ అక్షరం పేర్లలో తప్పులు లేకుండా, స్పేస్ (గ్యాప్) లేకుండా సరి చూసుకోవాలి. పిల్లల ఆధార్ కార్డు నమోదుకు ముందు తల్లిదండ్రుల ఆధార్ కార్డును ఒక సారి సరిచూసుకోవాలి. దానిని నవీకరణ చేయించుకొని సెల్ ఫోన్ నంబర్‌తో అనుసంధానమై ఉండాలి. జనన ధ్రువపత్రం తప్పని సరిగా డిజిటల్‌గా పొంది ఉండాలి. క్యూఆర్ కోడ్ కూడా ఉండాలి.