High Demand for Eco Friendly Lord Vinayaka Clay Idols :రాష్ట్రవ్యాప్తంగా ఊరూ-వాడ వినాయక చవితి సందడి నెలకొంది. బొజ్జగణపయ్య ప్రతిష్ఠాపనకు పెద్దసంఖ్యలో మండపాలు కొలువుదీరాయి. పర్యావరణ పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సూచించారు. వినాయక చవితి పురస్కరించుకొని హైదరాబాద్ అశోక్‌నగర్‌లో మట్టి గణపతులు పంపిణీ చేశారు. మట్టి వినాయకులను పూజించడం వల్ల సుప్రీంకోర్టు తీర్పును చట్టాన్ని గౌరవించడంతో పాటు పర్యావరణాన్ని రక్షిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
లక్డీకాపుల్‌లోని కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కంటోన్మెంట్వ్యాప్తంగా ఏర్పాటు చేసే గణనాథులకు ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. దాదాపు వెయ్యి లడ్డూలను గణేశ్ మండప నిర్వాహకులకు పంపిణీ చేసినట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈసారి జీహెచ్‌ఎంసీ 3 లక్షల 15 వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేసింది. గణేశ్ నిమర్జనం కోసం నగరవ్యాప్తంగా 73 చెరువులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
'మట్టి వినాయకులను పూజించి సుప్రీంకోర్టు తీర్పు చట్టాన్ని గౌరవించడంతో పాటు పర్యావరణాన్ని రక్షించడం మన బాధ్యతా. మట్టి విగ్రహాల వల్ల కోర్టును గౌరవించినట్లు, పర్యావరణాన్ని రక్షించిన వాళ్లం అవుతాం'- పొన్నం ప్రభాకర్, మంత్రి
పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి వినాయకులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి ఎంపీ రఘునందన్ రావు భక్తులకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మట్టి ప్రతిమలకు భిన్నంగా ఆవు పేడతో విగ్రహాలు తయారు చేసి సిద్దిపేటకు చెందిన మొరంశెట్టి రాములు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 2014 నుంచి నేటి వరకు నిర్విరామంగా ఏడాదికి 5 నుంచి 6 వేల గోమయ విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటన్నింటిని ఉచితంగా పాఠశాలలకు, స్థానికులకు పంపిణీ చేస్తున్నారు.