Heavy Rains in Vijayawada :ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని విజయవాడలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీల్లోని రోడ్లు జలమయం కావడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు వన్ టౌన్ రాజగిరివారి వీధిలోని కొండపై నిర్మించిన ఓ ఇల్లు పాక్షికంగా కూలింది. ఇంటిలోని వారు అప్రమత్తంగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటన గురించి తెలుసుకున్న వీఎంసీ (Vijayawada Municipal Corporation) అధికారులు ఇల్లు కూలిన ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కట్లేరు వాగు ఉధ్ధృతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన పరిశీలించారు.
Collector Srujana Visited Katleru Vagu :ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు కట్లేరు వాగు వరద ఉద్ధృతి పెరిగింది. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు గంపలగూడెం మండలం వినగడప వద్ద తాత్కాలిక రహదారిపై నుంచి వరద ప్రవహిస్తోంది. గంపలగూడెం - చీమలపాడు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ, నూజివీడు, మచిలీపట్నం వైపు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జోరుగా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. పలు చోట్ల వాగులు, వరదలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ మురుగు రోడ్డు పైకి చేరింది. వ్యాధులు ప్రభలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సృజన సూచించారు.