Heavy Rain in Siddipet District :అకాల వర్షాలు సిద్దిపేట జిల్లాను అతలాకుతలం చేశాయి. ఇవాళ సాయంత్రం పట్టణంలో దాదాపు గంటసేపు కురిసిన భారీ వడగళ్ల వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటలు కూడా తీవ్రస్థాయిలో దెబ్బతినడంతో రైతులు తల్లడిల్లిపోయారు. సిద్దిపేట పట్టణం, దుబ్బాక నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది.
జిల్లాలోని మిరుదొడ్డి మండలంలో లక్ష్మీ నగర్, ధర్మారం, కొండాపూర్, అల్వాల, కాసులాబాద్, అక్బర్ పేట- భూంపల్లి మండలం పరిధి ఖాజీపూర్, వీరారెడ్డిపల్లి, జంగపల్లి గ్రామాల్లో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా సిద్దిపేటలో భారీ వడగళ్ల వర్షం కురిసింది. సిద్దిపేటలో భారీ వర్షానికి రహదారులపై చెట్టు కొమ్మలు సైతం విరిగి పడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని రహదారి ప్రధాన రహదారిపై గుంతలు ఉండడంతో వర్షపు నీటితో నిండాయి. దీంతో రహదారి బురదమయంగా మారింది.
Farmers Lost Crops for Heavy Rain :అకాల వర్షాకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మామిడి పంటకు నష్టం వాటిల్లింది. మరో రెండు నెలల్లో పంట చేతికి వచ్చేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి పెట్టి మంచి కాపు వచ్చిందనుకుంటున్న సమయంలో వరుణుడు వచ్చి పంటకు తీరని నష్టం మిగిల్చారని కర్షకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లిలో భారీగా మామిడి కాయలు నేలరాలాయి. భీకరమైన గాలులు, వడగళ్లతో కాయలు భారీగా నేలరాలాయి. బొప్పాపూర్ గ్రామానికి చెందిన నర్సింగరావు అనే రైతు 12 ఎకరాల్లో మామిడి సాగు చేయగా వడగండ్ల బీభత్సానికి 80 శాతం కాయలు రాలిపోయాయి. దీంతో దాదాపు 12 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆ రైతు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని ఇచ్చి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.