తెలంగాణ

telangana

తెలుగు రాష్ట్రాలకు మరో డేంజర్ - ఇవాళ్టి నుంచి 4 రోజుల వరకు అతిభారీ వర్షాలు! - HEAVY RAIN ALERT TO TELUGU STATES

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 3:36 PM IST

Heavy Rain Alert To Telugu States : తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇరు రాష్ట్రాల్లో ఇవాళ్టి (సెప్టెంబరు 4వతేదీ) ఈనెల 8వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. వాతావరణ శాఖ ప్రకటనతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు ఇంకో డేంజర్ తమను ముంచేందుకు వస్తోందంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Heavy Rain Alert To Telugu States
Heavy Rain Alert To Telugu States (ETV Bharat)

Telangana Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు సృష్టించిన విలయం నుంచి ఇప్పటి వరకు ప్రజలు తేరుకోలేకపోతున్నారు. ఇంతలోనే మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే వరదల నుంచి తేరుకోలేకపోతున్నామని, మళ్లీ వర్షాలంటే ప్రాణాలు కూడా దక్కుతాయో లేదని భయాందోళన చెందుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

AP Rain Alert Today : కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో ఇవాళ (సెప్టెంబరు 4వతేదీ), రేపు (సెప్టెంబరు 5వతేదీ) రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈనెల 6వ తేదీన పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భద్రాచలం వద్ద 43.1 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - Godavari rising at Bhadrachalam

Telangana Rains Updates :ఇవాళ (బుధవారం) ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. గురువారం రోజున భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉందని, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

మరోవైపు ఏపీలోనూ ఇవాళ్టి నుంచి 8వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ మూడూ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, యానం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

ములుగు జిల్లాలో టోర్నడో తరహా బీభత్సం - 500 ఎకరాల్లో భారీగా నేలకొరిగిన చెట్లు - 50k trees Fall In Eturnagaram

పొలాల నిండా బండరాళ్లు, ఇసుకు మేటలు - భారీ వర్షాలతో ఆనవాళ్లు కోల్పోయిన పంట పొలాలు - Flood Effect To Telangana Crops

ABOUT THE AUTHOR

...view details