Heavy Rains in Telangana : రాష్ట్రంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. సోమవారం ఏకధాటిగా కురిసిన వానకు పలు జిల్లాల్లోని రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం వరద నీటితో మునిగింది. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
డ్రైనేజీ రోడ్లపై ప్రవహించడంతో పలు కాలనీలు దుర్గంధంలో చిక్కుకున్నాయి. వరద నీరు రోడ్లపై ప్రవహించి చెరువులను తలపించాయి. ఆదివారం కూడా వర్షపు నీటితో హైదరాబాద్ తడిముద్ద అయింది. ఏకధాటిగా మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం : ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వరంగల్, హనుమకొండ, కాజీపేట, నర్సంపేటలో పడిన వానకు రహదారులు జలమయమయ్యాయి. బస్టాండ్లోనూ వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల, రాఘువరెడ్డిపేట గ్రామాల మధ్య వాగుపై తాత్కాలికంగా నిర్మించిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వాగు అవతలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.