Telangana Water Projects Filled with Flood Water :ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. 5.52 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 85 గేట్లు ఎత్తి 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ నుంచి 66 గేట్లు ఎత్తి 16,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కృష్ణాపరివాహక ప్రాజెక్టులకు వరద రాక పెరిగింది.
ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి వస్తున్న వరద తాకిడితో జూరాల జలాశయం 17 గేట్లెత్తి నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 92 వేలు, ఔట్ ఫ్లో 1.71 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.170 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.042 టీఎంసీలుగా ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు : భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 385 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. నిజాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు ఉండగా ప్రస్తుతం 1387 అడుగులకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3 టీఎంసీలు నీటి నిల్వ ఉంది.
హుస్సేన్ సాగర్‌కు జలకళ : హైదరాబాద్‌లోని హుస్సేన్సాగర్కి వరద నీరు పోటెత్తడంతో నిండుకుండలా మారింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 513.1 అడుగులుగా ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సాగర్‌లోకి చేరుతున్న వరద నీటిని దిగువకు వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.