Hari Hara Travels Owner Satish Cars Case : సంగారెడ్డి జిల్లాకు చెందిన హరిహర ట్రావెల్స్ యజమాని సతీశ్ ఆరు కార్లను ఎట్టకేలకు పులివెందుల నుంచి సంగారెడ్డి పోలీసులు తీసుకువచ్చారు. గత మూడేళ్ల నుంచి కార్ల అదృశ్యంపై పోరాడుతుంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 30 రోజుల్లోనే తమ సమస్యను కొంతమేర పరిష్కరించినట్లు సతీశ్ చెప్తున్నారు. అతని వద్ద నుంచి వికారాబాద్‌కు చెందిన మణిరాజ్ ఆరు కార్లను అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఆ కార్లను కడప జిల్లా పులివెందులలో ఎంపీ అవినాశ్ అనుచరులకు మణిరాజ్ కొదవ పెట్టాడు. తెలంగాణలో ఉండాల్సిన కార్లు ఆంధ్రప్రదేశ్‌లో కనిపించడంతో ట్రావెల్స్ యజమాని సతీశ్‌కు అనుమానం వచ్చింది. పరిశీలించి చూడగా అవి తమ కార్లే అని నిర్ధారణకు వచ్చిన సతీశ్, తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఎంపీ అవినాశ్ అనుచరులు అతనిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ట్రావెల్స్ యజమాని ఆరోపిస్తున్నారు.
కార్లకు కట్టాల్సిన ఈఎమ్ఐల కోసం అప్పు :తన వద్ద అద్దెకు తీసుకున్న మణిరాజ్ మాత్రం పరారీలో ఉన్నాడని, కనీసం ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో మూడేళ్ల నుంచి నరకయాతన అనుభవిస్తున్నట్లు సతీశ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 30 రోజుల వ్యవధిలోని తమ కారులు తిరిగి సంగారెడ్డికి తెప్పించడంపై సతీశ్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ మూడేళ్లలో కార్లకు కట్టాల్సిన ఈఎమ్ఐల కోసం అప్పు తెచ్చి మరీ చెల్లించినట్లు చెప్తున్నారు.