చేతినిండా పని లేక, సరైన డబ్బులు రాక - దయనీయంగా చేనేత కార్మికుల పరిస్థితి (ETV Bharat) Handloom Workers Problems in Hanamkonda :హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని ది శాయంపేట చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం గత కొన్ని సంవత్సరాలుగా చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచింది. ఈ సంఘంపై ఆధారపడి వందల కుటుంబాలు జీవనాన్ని కొనసాగించాయి. కాలక్రమేణా ఈ సహకార సంఘం మూసివేత దశకు చేరువైంది. చేనేత మగ్గాలు మూలకు పడి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకప్పుడు వందకు పైగా మగ్గాలపై బట్టలు నేస్తూ కళకళలాడిన చేనేత సంఘం, ఇప్పుడు చేసేందుకు పని లేక 20 నుంచి 30 మంది అతి కష్టం మీద కుటుంబాలను నెట్టుకొస్తున్నారు.
పనికి అంతంత మాత్రం డబ్బులు రావడంతో మగ్గాలపై ఆధారపడి జీవించే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయంటూ చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనోపాధి లేకపోవడంతో ఇక్కడ ఉన్న యువకులు వలసలకు వెళ్లి జీవిస్తున్నారు. కొన్ని ఏళ్లుగా పని చేస్తున్న చేనేత కార్మికులు వేరే పని చేయలేక, సంఘంలో పని దొరకక ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు పని చేసినా రూ.200 నుంచి రూ.300 వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. మహిళా కార్మికులకు రూ.150 రావడం కష్టంగా ఉందని చింతిస్తున్నారు.
చేనేత కార్మికులకుపని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలి :నిత్య అవసరాల ధరలు పెరగడంతో వచ్చే డబ్బులు సరిపోక కుటుంబ పోషణ భారమై, చేనేత కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మనోవేదన చెందుతున్నారు. ఇటీవల రెండు నెలలుగా పూర్తిగా పని లేకపోవడంతో ఇల్లు గడవలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. శాయంపేట చేనేత సహకార సంఘంలో ఇవే పరిస్థితులు కొనసాగితే, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోతున్నారు. స్థానిక సహకార సంఘం కమిటీతో పాటు సంబంధిత అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఆదుకోవాలని కోరుతున్నారు. కార్మికులకు పని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. లేకపోతే పస్తులతో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'శాయంపేట చేనేత పారిశ్రామిక సహకార సంఘంలో గత 30 ఏళ్ల నుంచి పని చేస్తున్నా. రోజూ 8 గంటలు పని చేస్తే రూ.200 నుంచి రూ.300 వరకు వస్తోంది. పదేళ్ల ముందు వంద మగ్గాలకు వంద మంది పని చేసేవారు. ఇప్పుడు 30 మంది మాత్రమే పని చేస్తున్నాం. గిట్టుబాటు కాకపోయినా వేరే పని చేయలేక ఈ పనే చేస్తున్నాం. ప్రస్తుతం పని లేక సరైన డబ్బులు రావడం లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.' - చేనేత కార్మికులు
పనిలేక చేనేత కార్మికుల అవస్థలు - నిలిచిన బతుకమ్మ చీరల తయారీ