GURUVESWARA RAO GOT FOUR GOVT JOBS :ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచకు చెందిన రైతు దంపతులు సత్యనారాయణ, లక్ష్మీ కుమారుడు ఇనపాల గురువేశ్వరరావు. సాధారణ మధ్యతరగతి వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టిన గురువేశ్వరరావు చిన్నప్పటికీ నుంచీ సరస్వతీ పుత్రుడే. పాఠశాల విద్య మొదలైనప్పటి నుంచే చదువుల్లో గురువేశ్వరరావే టాపర్. పదోతరగతి వరకు పేరువంచ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు.
సర్కారీ కొలువులపైనే గురి : ఇంటర్ కల్లూరులో పూర్తి చేశాడు. ఎంసెట్‌లో మంచి మార్కులు సాధించి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచీ ప్రభుత్వ కొలువు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న గురువేశ్వరరావు, బీటెక్ తర్వాత సర్కారీ కొలువులపైనే గురి పెట్టాడు. తాను పెట్టుకున్న లక్ష్యంపై చిన్నప్పటి నుంచే ప్రత్యేక దృష్టి పెట్టిన ఈ యువకుడు, అందుకు అనుగుణంగానే ఎక్కడా ఏమరపాటుకు తావులేకుండా అనుకున్న లక్ష్యం వైపు చదువుల పయనం సాగించాడు.
మొక్కవోని దీక్షతో సాధన : బీటెక్ తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్న గురువేశ్వరరావు, హైదరాబాద్‌కు పయనమయ్యాడు. పోటీ పరీక్షలకు శిక్షణ నిచ్చే సంస్థలో చేరి, అక్కడి నుంచి విరామం లేకుండా పట్టుదలతో చదివాడు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో అనేక ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకు సాగాడు. ప్రభుత్వ ఉద్యోగ వేటలో నిమగ్నమైన గురువేశ్వరరావు, ఉద్యోగం సాధించిన తర్వాత సొంతూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ఒకటి రెండు కాదు ఏకంగా వరుసగా నాలుగు ప్రభుత్వ కొలువులు సాధించి ఔరా అనిపించాడు. తొలుత నీటి పారుదలశాఖలో 2022లో విడుదలైన ఏఈ ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రస్థాయి 253వ ర్యాంకుతో కొలువు సాధించాడు. తర్వాత గ్రూప్-4 లో 1825 ర్యాంకుతో ఉద్యోగానికీ ఎంపికయ్యాడు. పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 215వ ర్యాంకు పొందాడు. తాజాగా టీజీపీఎస్సీ విడుదల చేసిన నీటిపారుదలశాఖ ఏఈఈ నియామక పరీక్షలో 257 ర్యాంకు సాధించి ఉద్యోగం సాధించాడు.