Gurukula Student Died In Bhuvanagiri : భువనగిరి సాంఘీక సంక్షేమ పాఠశాల వసతి గృహంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులలో ప్రశాంత్ అనే విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జిల్లాకు చెందిన పోచంపల్లి మండలం జిబ్లిక్‌పల్లికి చెందిన మహేష్ కుమారుడు ప్రశాంత్ ఆరోతరగతి చదువుతున్నాడు. ఈ నెల 12 న కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో సిబ్బంది విద్యార్థులను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. దీనిలో ప్రశాంత్ అనే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
మధ్యాహ్న భోజనం వికటించి 16 మంది విద్యార్థులకు అస్వస్థత
Food Poisoning in Bhuvanagiri Gurukula Hostel : వారం రోజులుగా మృత్యువుతో పోరాడి మంగళవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్షంతో తమ కొడుకుని కోల్పోవాల్సి వచ్చిందని మృతిని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులు ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు, ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు, భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు కోలుకోవటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
విద్యార్థులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే :ఘటన వివరాలు తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తరుపు నుంచి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. సాంఘిక సంక్షేమ పాఠశాల హాస్టల్‌ను సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీరాముల శ్రీనివాస్, సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మిలను సస్పెండ్ చేశారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా వైస్ ప్రిన్సిపాల్ రాముకు బాధ్యతలు అప్పగించారు.
ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. గతంలోనే ఇలాంటి ఘటనలు జరిగినా ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం కనిపిస్తోందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సిబ్బంది చర్యలు తీసుకోకపోవడం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్నది వారి వాదన. ఇకనుంచైనా అధికారులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు.
చదువులమ్మ ఒడిలో సమస్యల వ్యథ - విద్యార్థులను వెంటాడుతున్న వసతుల లేమి!
ప్రభుత్వ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ - 16 మందికి విద్యార్థినులకు అస్వస్థత