Governor Quota MLC Case Postponed : గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియామకం కావడానికి అన్ని అర్హతలు ప్రొఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్‌కు ఉన్నాయని వాళ్ల తరపు న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకు తెలిపారు. మంత్రి మండలి సిఫార్సుల మేరకే రాష్ట్ర గవర్నర్ ఇద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమించారన్నారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ నామినేషన్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణను కొనసాగించింది.
ప్రతివాదులైన కోదండరాం, ఆమిర్ అలీఖాన్ తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలను కొనసాగిస్తూ తమను ఎమ్మెల్సీలుగా నియమించండని కోరే హక్కు వ్యక్తిగతంగా ఎవరికీ ఉండదని ధర్మాసనానికి తెలిపారు. గవర్నర్ మంత్రి మండలి సిఫార్సులకు కట్టుబడి ఉండాల్సిందేనని, అయితే మంత్రి మండలి చేసే సిఫార్సులను పరిశీలించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉందని అన్నారు. దీనికి సంబంధించి పలు కోర్టు తీర్పులను అవినాష్ దేశాయ్ ప్రస్తావించారు.
Governor Quota MLC Case in High Court :గత మంత్రి మండలి సిఫార్సులను గవర్నర్ సెప్టెంబరులో తిరస్కరించారని అనంతరం డిసెంబరులో తమ నియామక ప్రక్రియ ప్రారంభమై జనవరిలో పూర్తయిందని న్యాయవాది అవినాష్ దేశాయ్ ధర్మాసనానికి తెలిపారు. సెప్టెంబరులో గవర్నర్ తిరస్కరించిన మంత్రి మండలి సిఫార్సులను తరువాత వాటిని తిరిగి గవర్నర్‌కు పంపి ఉండవచ్చని కానీ ఇక్కడ అలా జరగలేదన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గవర్నర్ పునః పరిశీలన చేయాలని చెప్పలేదని, తిరస్కరించినట్లు పేర్కొన్నారని, పునఃపరిశీలన, తిరస్కరణ వేర్వేరు అంటూ వ్యాఖ్యానించింది.