Telangana CM Revanth Reddy Foreign Tour : పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం నేటి నుంచి విదేశాల్లో పర్యటించనుంది. స్కిల్ యూనివర్సిటీతో భాగస్వామ్యంపై ఒప్పందాలతో పాటు పెట్టుబడులపై సింగపూర్ పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. అక్కడి నుంచి ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లనున్న సీఎం బృందం దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని, ప్రముఖ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసంతో ఉన్నారు.
పర్యటన వివరాలు : విదేశాల్లో రాష్ట్ర బృందం పెట్టుబడుల వేట నేటి నుంచి మొదలు కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సింగపూర్, స్విట్జర్లాండ్‌లో పర్యటించనున్నారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 20 వరకు సింగపూర్‌లోనే ఉంటారు. ఛాంగిలోని సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్‌ను సందర్శించనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు జరగనున్నాయి. పారిశ్రామిక పెట్టుబడులపై కంపెనీలతో చర్చించనున్నారు.
ఈ నెల 20న అర్ధరాత్రి సింగపూర్‌లోని ఛాంగి విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్తారు. ఈ నెల 21న ఉదయం స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ విమానాశ్రయం చేరుకొని దావోస్ వెళ్తారు. దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరంలో సీఎం బృందం పాల్గొననుంది. దేశ, విదేశాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు సదస్సుకు హాజరు కానున్నారు. పారిశ్రామికవేత్తలతో రాష్ట్రానికి పెట్టుబడులపై చర్చించి ఒప్పందాలు చేసుకోనున్నారు.
14 ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు : గత ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం హాజరైంది. అప్పుడు రూ.40 వేల 232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు దావోస్ వేదికగా 18 ప్రాజెక్టుల కోసం 14 ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరగ్గా, వాటిలో 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. పది ప్రాజెక్టులు పురోగతిలో ఉండగా, మరో 7 ప్రారంభ దశలో ఉన్నాయి.
దావోస్ పర్యటనలో ఈసారి భారీగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం బయలుదేరుతోంది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌కు ఉన్న సానుకూలతలతో భారీగా పెట్టుబడులు వస్తాయని సీఎం ధీమాతో ఉన్నారు. ఫ్యూచర్ సిటీగా హైదరాబాద్‌ను మరోసారి ప్రపంచ వేదికలపై చాటి చెప్పాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన - మంత్రి వర్గ విస్తరణపై చర్చ?