Israel Gaza Ceasefire Deal : ఎట్టకేలకు పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి. దాదాపు 15 నెలలుగా కొనసాగుతున్న దాడులు నిలిచిపోనున్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేయటం వల్ల పశ్చిమాసియాలో యుద్ధం మొదలవ్వగ, ఇజ్రాయెల్ ప్రతీకారదాడులతో గాజా శిథిలాల కప్పగా మారింది. వేలాది మంది ముఖ్యంగా అమాయక ప్రజలు చనిపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. గాజాలో శాంతిస్థాపనే లక్ష్యంగా అమెరికా మద్దతుతో కొన్ని నెలలుగా ఇజ్రాయెల్-హమాస్‌తో ఈజిప్టు, ఖతార్‌లు జరిపిన చర్చలు ఫలించాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని చర్చల్లో పాల్గొన్న ఖతార్ ప్రతినిధి ప్రకటించారు.
కాల్పుల విరమణతోపాటు బందీల విడుదల అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండనుంది. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు ఇజ్రాయెల్- హమాస్ ప్రతినిధులు మళ్లీ చర్చలు జరపనున్నారు. ఒప్పందంలో భాగంగా తొలుత ఇజ్రాయెల్ సేనలు గాజాను వీడనున్నాయి. అనంతరం తమ వద్ద ఉన్న వంద మంది బందీల్లో 33 మందిని హమాస్ విడుదల చేయనుంది. అందుకు బదులుగా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ధ్రువీకరించారు. ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ముందే ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం కుదిరేలా బైడెన్ సర్కార్ ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు ఒప్పందం కుదిరిందని, త్వరలోనే వారు విడుదల అవుతారని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న సమాచారం మేరకు గాజా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ప్రజలు ప్రధాన కూడళ్లలో గుమిగూడి ఒకరినొకరు ఆలింగనం చేసుకోవటమే కాకుండా తమ సెల్‌ఫోన్లతో ఫొటోలు తీసుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
#WATCH | Visuals from the streets of Tel Aviv after Israel and Hamas reached a ceasefire and hostage deal pic.twitter.com/z7Ff1ZhDXs
— ANI (@ANI) January 15, 2025