Son Kills Father Over Broken Aquarium in Shamirpet : వస్తువులని వాడుకోవాలి. మనుషులని ప్రేమించాలి. కానీ మారుతున్న డిజిటల్ ప్రపంచంలో మనుషుల్ని వాడుకొని, వస్తువులను ప్రేమించడం మొదలుపెట్టాం. వస్తువులను మనుషుల కంటే అమితంగా ఇష్టపడటం అనేక అనర్థాలకు దారి తీస్తోంది. ఇందుకు ఈ ఘటనే తార్కాణం. ఓ కుటుంబం వస్తువులపై పెంచుకున్న ప్రేమ ఆ ఇంట్లో ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ఒక చీర కోసం తల్లి, కుమార్తె మధ్య వివాదం ఏర్పడింది. ఈ తగాదాలో పక్కన ఉన్న అక్వేరియం గాజు పగలడంతో మద్యం మత్తులో ఉన్న కుమారుడు తల్లిపై రోకలితో దాడి చేశాడు. ఇది గమనించిన తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ వివాదంలో కోపోద్రిక్తుడైన కుమారుడు తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది.
ఇష్టంగా తెచ్చుకున్న అక్వేరియం గాజు పగిలిందనే కోపంలో మద్యం మత్తులో ఉన్న కుమారుడు కన్నతల్లిపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎస్.శ్రీనాథ్, స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం, శామీర్‌పేట పెద్దమ్మ కాలనీకి చెందిన ఆలకుంట హన్మంత్ (50) కూలీ పనులు చేస్తాడు. అతని కుమారుడు నర్సింహ (28) మద్యానికి బానిస కావడంతో అతని భార్య వదిలేసింది. దీంతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.
ఈ నెల 14న అతని తల్లి, చెల్లికి మధ్య చీరపై ఓ వివాదం జరిగింది. ఈ క్రమంలో తల్లి చేతికి అనుకోకుండా అక్వేరియం తగిలింది. దీంతో అక్వేరియం కింద పడి పగిలిపోయింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నర్సింహ ఆగ్రహంతో తల్లిపై రోకలి బండతో దాడి చేశాడు. ఇది గమనించిన తండ్రి కుమారుడిని అడ్డుకున్నాడు. దీంతో నర్సింహ అదే రోకలితో తండ్రి హన్మంత్ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో తండ్రి అక్కడి నుంచి తప్పించుకుని పోతున్నా వదలకుండా వెంబడించాడు. ఇటుక తీసుకొని తలపై మోదగా, హన్మంత్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కుమార్తెతో అసభ్య ప్రవర్తన - భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు
రంగారెడ్డి జిల్లా జంట హత్యల కేసులో ట్విస్ట్ - వివాహేతర సంబంధమే కారణమా?