Government Permits Land Pooling in Hyderabad : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని భూ సమీకరణ(ల్యాండ్ పూలింగ్) ప్రాజెక్టుపై ముందుకే వెళ్లాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. నగరం అవుటర్ రింగ్ రోడ్డు దాటి విస్తరిస్తుండటంతో కొత్త ఆవాసాలకు భూమి లభ్యత చాలా కీలకం. అంతేగాక స్థిరాస్తి రంగానికీ కొత్త ఊపు రానుంది. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ పథకంపై కొంత సందిగ్ధత ఉన్నప్పటికీ పలు కారణాలతో ముందుకే పోనుంది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలికి సంబంధిత బాధ్యతలను కేటాయిస్తూ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
ఆ భూముల్లో ప్రభుత్వ వెంచర్లు!.. జీవనోపాధి కోల్పోతామని అన్నదాతల ఆవేదన
మహానగరం చుట్టూ ఉన్న గ్రామాల్లో ముఖ్యంగా బాహ్యవలయ రహదారి వెలుపల రైతులకు సంబంధించిన భూములను వారి ఇష్టంతోనే సమీకరించి లేఅవుట్లు వేసేందుకు హెచ్ఎండీఏ అప్పట్లోనే శ్రీకారం చుట్టింది. తొలుత ఇన్ముల్‌నెర్వలో 95.25ఎకరాలు, లేమూరులో 83.48 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి పనులను ప్రారంభించింది. ఇప్పటికే లేమూరులో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇన్ముల్‌నెర్వలో భూముల సేకరణ ఒక కొలిక్కి వచ్చింది. మిగతా ప్రాంతాల్లోనూ అధికారులు రైతులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు ఆటంకం కలిగింది. ల్యాండ్ పూలింగ్, వేఅవుట్ల అభివృద్ధి, విక్రయాలతో సర్కారుకు ఆదాయం సమకూరే అవకాశం ఉండటంతో కొత్త ప్రభుత్వం నుంచి సానుకూలత లభించింది. ఈ క్రమంలో తదుపరి కార్యాచరణలు అధికారులు మొదలు పెట్టారు.
HMDA Layouts in City Outskirts :హెచ్ఎండీఏ లేఅవుట్ల కోసం గుర్తించిన భూములన్నీ దాదాపు సాగులో లేవు. ఆయా ప్రాంతాల్లో భూములు అసైన్డ్ కేటగిరిలో ఉండటంతో రైతులతో మాట్లాడి వారిని అధికారులు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారి నుంచి సమీకరించిన భూమిని హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తోంది. లేఅవుట్ల కింద మారుస్తుంది. రహదారులు, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ ఇలా అన్ని వసతులు కల్పించనుంది. అభివృద్ధి చేసిన భూమిలో రైతులకు 60శాతం బదిలీ చేస్తోంది. మిగత 40శాతాన్ని హెచ్ఎండీఏ విక్రయింస్తుంది. ల్యాండు పూలింగ్‌లో భాగంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దాదాపు 924.28 ఎకరాలను పరిశీలించారు.