Government Jobs Achieved Students of Adilabad : అదో మారుమూలన ఉండే చిన్న పల్లె. బాహ్యప్రపంచానికి అంతగా తెలియని గిరిజన తండా. అక్కడేం ఉంటుందనుకుంటే పొరపాటే. తరచిచూస్తే చదువులమ్మకు నమస్కరించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపిస్తోంది. భూతల్లికి ప్రణమిళ్లి వ్యవసాయంలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. ఎన్నికల సమయంలోనే రాజకీయాలంటూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని చిన్నబుగ్గారం పల్లె గురించి తెలుసుకుందాం.
ప్రత్యేకత చాటుకుంటున్న చిన్న బుగ్గారం:ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని చిన్న బుగ్గారం చిన్న పల్లె. మూడు దశాబ్దాల కిందట వ్యవసాయం తప్పితే మరో ధ్యాసే లేని సాధారణ గ్రామం. ప్రస్తుతం జనాభా 580 వరకు ఉంటే 409 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఓ అంగన్వాడీ కేంద్రం, ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఉంది. పాతికేళ్ల కిందట బడికి వెళ్లాలంటే పక్క గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో చేరాల్సిందే. అది చిన్నబుగ్గారం గతం.
ప్రభుత్వ ఉద్యోగాలు : గతంలో గ్రామానికి చెందిన ప్రతాప్‌సింగ్, శ్రావణ్‌కుమార్ అప్పటి జిల్లా సెలెక్షన్ కమిటీ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక కావటం పల్లెని ఓ మలుపుతిప్పింది. వారిని ప్రేరణగా తీసుకున్న తల్లిదండ్రులు పిల్లలను చదివించటంతో ప్రయోజకులను చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారి సంఖ్య అక్షరాలా 82 మంది అంటే నమ్మితీరాల్సిందే. రెవెన్యూ, పోలీసు, విద్య, వైద్యం వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు చిన్నబుగ్గారం వేదికగా నిలుస్తోంది.