Gollupalem Villagers Common Name With Devudu and Devudamma :సత్య దేవుడు, కృష్ణ దేవుడు, మురళి దేవుడు, రామారావు దేవుడు. లక్ష్మీ దేవుడమ్మ ఇలా, ఆ ఊళ్లో ఎవరిని పలకరించినా దేవుడు, దేవుడమ్మ అని వినిపిస్తుంది. అలానే పిలుస్తారు. దేవుళ్ల పేర్లేంటి, అనుకుంటున్నారా! నిజమేనండి, ఆ పల్లెలో ఇంటికొక దేవుడు, దేవుడమ్మలు ఉంటారు. గ్రామంలోని రెండు వేల మందిలో ఇలా, రమారమి 600 మంది వరకు ఈ పేర్లతోనే పిలవబడతారు. అక్కడ వంశపార్యం పరంగా వస్తున్న ఆచారమిది. తరాలు మారినా ఈ సంప్రదాయం మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం పుట్టిన పిల్లలకూ ఇంట్లో మొదట పెట్టే పేరు దేవుడు, దేవుడమ్మే. ఈ ఆచారమెక్కడో, ఆ ఆనవాయితీ వెనకున్న అసల విషయమేమిటో ఇప్పుడు చుద్దాం.
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొల్లుపాలెం. ఈ పల్లె జనాభా 2000. వీరిలో సుమారు 600 మంది దేవుళ్లుంటారు. గొల్లి దేవుడు, తిరుపతి దేవుడు, కర్రి దేవుడు, మొకలొళ్ల దేవుడు, సింహాద్రి దేవుడు, చంద్రినాయుడు దేవుడు, లక్ష్మి దేవుడమ్మ, రమాదేవి దేవుడమ్మ, గొల్లి సత్యవతి దేవుడమ్మ, అక్కమ్మ దేవుడమ్మ. ఇలా ప్రతి ఇంటిలోనూ దేవుడు, దేవుడమ్మ ఉంటారు. ముఖ్యంగా గొల్లొళ్లు, తొత్తరొళ్లు, రొంగలి, ఈదిబిల్లోళ్లు, యోత్రాటోళ్లు కుటుంబాలకు చెందిన వారి ఇళ్లల్లో దేవుడు, దేవుడమ్మ పేర్ల తప్పనిసరి. గొల్లుపాలెంలో దేవుడు, దేవుడమ్మని నామకరణం చేసే ఆనవాయితీ. వందల సంవత్సరాల నుంచి కొనసాగుతోంది.
ఒకే పేరుతో అంతమందికి గుర్తు పట్టడం ఎలా : అప్పటి నుంచి నేటి వరకు కూడా గ్రామస్థులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి ఇంట్లో మొదటి మగ, ఆడ సంతానికి దేవుడు పేరు తప్పనిసరిగా ఆచరిస్తున్నారు. సింహాద్రి అప్పన్నపై ఉన్న భక్తి, విశ్వాసమే ఈ ఆచారం వెనకున్న అసలు రహస్యమంటున్నారు గొల్లుపాలెం వాసులు. గొల్లుపాలెంలో ప్రతి గడపలో దేవుడు, దేవుడమ్మ పేర్లు కొనసాగుతుండటం విన్న, తెలిసిన వారందరికి వింతగానే గోచరిస్తుంది. అయితే ఒకే పేరుతో అంతమందికి గుర్తు పట్టడం ఎలా అన్న సందేహమూ రాక మానదు. ఇది నిజమేనండి.