Godavari River Turns as Suicide Spot :గోదావరి నది అని చెప్పగానే గలగలా పారే నది అందరికీ గుర్తొస్తుంది. స్వచ్ఛమైన నీళ్లు పారుతుంటే మనసు పరవశించి పోతుంది. అనేక మంది పుణ్యస్నానాలు సైతం ఆచరిస్తారు. అయితే నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ వద్ద గోదావరి నది తీరం సూసైడ్ స్పాట్‌గా మారిపోయింది. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెందిన అనేక మందికి చనిపోవాలనుకునే ముందు యంచ వద్ద గోదావరి తీరమే గుర్తుస్తోంది. అంతలా ఆత్మహత్యలకు చిరునామాగా మారిపోయింది. వివిధ సమస్యలతో ఒత్తిడితో చావే శరణ్యమని భావించి యంచ వద్ద గోదావరి నదిలో ప్రాణాలు వదిలేస్తున్నారు.
విద్యార్థుల నుంచి మొదలు వృద్ధుల వరకు అంతా ఇక్కడే చనిపోతున్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో పవిత్ర గోదావరి ప్రవహిస్తోంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలి వస్తుంటారు. మరోవైపు వివిధ కారణాలతో నదిలో దూకి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. ఆత్మహత్యలతో బాధిత కుటుంబీకులకు తీరని శోకం మిగులుతోంది. నవీపేట మండలం యంచ వంతెన వైపు మూడేళ్లలో 25 మంది, నిర్మల్ జిల్లా బాసర వైపు ఆరు నెలల్లో 44 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నది పరిసర ప్రాంతాలు ఆత్మహత్యలకు కేంద్రంగా :వారధి మీదుగా నీటిలో దూకిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. నది పరిసర ప్రాంతాలు ఆత్మహత్యలకు కేంద్రంగా మారడంపై సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నదిలో నిత్యం మత్స్యకారులు చేపల వేట కోసం వస్తారు. నీళ్లలో దూకిన వారిని సమీపంలో ఉండే మత్స్యకారులు, అటుగా వెళ్లే యంచ యువకులు పదుల సంఖ్యలో తరచూ రక్షిస్తున్నారు. గతంలో ఓ యువతి, ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి వేర్వేరుగా నదిలో దూకగా యంచ మత్స్యకారులు యువతి, పిల్లల ప్రాణాలు కాపాడారు.