Attack On Boyfriend Family Members : త్వరలో వివాహం జరగబోయే ఓ యువతి ప్రేమించిన యువకునితో పారిపోయిన ఘటనలో యువతి కుటుంబ సభ్యులు యువకుని ఇంటిపై దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
పదర మండలం ఉడిమిళ్లలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి ఉడిమిళ్ల గ్రామానికి చెందిన ఎనుపోతుల శేఖర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. డిసెంబరు 12న అమ్మాయికి ఇతర గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి నిశ్చయమైంది. విషయం తెలుసుకున్న యువకుడు యువతిని తీసుకుని పారిపోయారు.
యువతిని కిడ్నాప్ చేశారంటూ మహిళపై దాడి :దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తులైన యువతి కుటుంబ సభ్యులు స్వామి, సకృ, భారతి, సోమ్ల, దేవి, హన్మంతు శేఖర్ కుటుంబానిపై మంగళవారం రాత్రి దాడికి దిగారు. శేఖర్ సోదరుడు రామాంజనేయులుపై దాడి చేస్తుండగా అడ్డొచ్చిన తల్లి చంద్రకళను విచక్షణారహితంగా కొట్టారు. జుట్టు పట్టుకుని సుమారు 100 మీటర్ల దూరం లాక్కుంటూ వెళ్లారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.