GHMC to Ban on Mayonnaise : మండి బిర్యానీ, చికెన్ కబాబ్, పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చట్నీలా వేసుకుని ఆహారప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేస్తుంది. ఇటీవల వెలుగు చూస్తున్న వరుస ఘటనలతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నిసార్లు హెచ్చరించినా హోటళ్ల నిర్వాహకులు తీరు మార్చుకోకపోవడంతో ఏకంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. నగరంలో మయోనైజ్‌ను నిషేధించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
వరుస ఘటనలతో అప్రమత్తం : చాంద్రాయణగుట్ట, కాటేదాన్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రోస్టేషన్‌లోని ఓ హోటల్‌లో, బంజారాహిల్స్‌లోని కొన్ని హోటళ్లలోని షవర్మా, మండి బిర్యానీ, బర్గర్లపై బల్దియాకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల్లో జరిపిన తనిఖీల్లో నాసిరకం మయోనైజ్‌ను అధికారులు గుర్తించారు.
అల్వాల్‌లోని ఓ హోటల్‌లో మయోనైజ్ తిన్న కొందరు యువకులు ఆసుపత్రి పాలయ్యారు. వారం రోజుల కిందట ఐదుగురు విరేచనాలు, వాంతులతో స్థానిక హాస్పిటల్లో చేరడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాసిరకం మయోనైజ్ వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలోనూ ఆ హోటల్‌లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. షవర్మా తిన్న 20 మందికి పైగా యువకులు మూడు, నాలుగు రోజుల తర్వాత ఆసుపత్రుల్లో చేరారు. కొంతమందికి రక్త పరీక్షలు చేయగా, వారి బ్లడ్‌లో హానికర సాల్మనెల్లా బాక్టీరియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు హోటల్‌లో షవర్మాపై బల్దియాకు ఫిర్యాదులు అందాయి.