Power Consumption Increased In Hyderabad : హైదరాబాద్ పరిధిలో ఏటా విద్యుత్తు వినియోగం పెరుగుతుంది. 2023లో సంవత్సర సగటు డిమాండ్ 2917 మెగావాట్ల ఉండగా, 2024లో 3218 మెగావాట్లకు పెరిగింది. వృద్ధి 10.18 శాతంగా నమోదు అయింది. హైదరాబాద్ నగర పరిధిలో 2024 డిసెంబరు నాటికి 62.92 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అంతకు ముందు ఏడాదిలో 60.26 లక్షలు ఉన్నాయి. ఏటా రెండు లక్షలకు పైగా కొత్త కనెక్షన్లు వస్తున్నాయి.
వేసవిలో విద్యుత్తు వినియోగం : విద్యుత్తు వాడకం మార్చి నెల నుంచి పెరుగుతుంది. ఏప్రిల్, మే వరకు ఎండల తీవ్రత వల్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు నెలలు వార్షిక సగటు వినియోగం కంటే అధికంగా ఉంటుంది. పెరుగుదలలో ఏకంగా మార్చి నెలలో 24.52 శాతం నమోదైంది. ఏప్రిల్‌లో 19.66, మేలో 13.46 శాతం రికార్టు స్థాయిలో నమోదైంది. జూన్‌లో తగ్గినా జులైలో 12.91 శాతం పెరిగింది.
గరిష్ఠానికి తగ్గట్టుగా ఏర్పాట్లు : గత అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం వేసవికి డిస్కం కార్యాచరణ కొనసాగించింది. గత రెండు సంవత్సరాల్లో 80 నుంచి 90 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదయ్యింది. ఈసారి సెంచరీ దాటుతుందని అంటున్నారు. గరిష్ఠ డిమాండ్ 5 వేల మెగావాట్లకు తగ్గట్టుగా కార్యాచరణ చేపట్టారు. జనవరి కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఆశించినంత వేగంగా పనులు జరగడం లేదు. ఎస్‌ఈలదే బాధ్యత.
నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై వేటు : వచ్చే ఈ వేసవిలో అంతరాయాల సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎస్‌ఈలదేనని నూతన సంవత్సరం సందర్భంగా సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు. ఆయన హెచ్చరికలతో ఎస్‌ఈలు నిర్లక్ష్యంగా ఉండే సిబ్బందిపై వేటు వేస్తున్నారు. ప్రజలు పవర్ సమస్యలపైన ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో గతంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏఈకి మెమో జారీ చేశారు.
- గరిష్ఠ వినియోగం (ఎంయూ) 2023లో 81.39 కాగా 2024లో 90.68గా ఉంది.
- గరిష్ఠ డిమాండ్ (ఎంవీ) 2023లో 3756కాగా 2024లో 4352 ఉంది.
తెలంగాణవాసులకు గొప్ప శుభవార్త - విద్యుత్ ఛార్జీల పెంపు లేదు
ఏడేళ్లలో విద్యుత్ డిమాండ్ డబుల్ అవుతుంది - అంచనా వేసిన ట్రాన్స్కో