Ganja Smuggling Through Inter State Borders : గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడానికి తెలంగాణ పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. అయినా, ప్రతి రోజూ ఎక్కడో ఒక్క చోట కేసులు బయటపడుతున్నాయి. పోలీసులు దీనిపై ఉక్కుపాదం మోపుతుండగా, అక్రమార్కులు కొత్త తరహాలో రవాణా చేస్తున్నారు.
యువతను మత్తుకు బానిసగా మారుస్తున్న గంజాయి వినియోగానికి రాష్ట్ర సరిహద్దులు గేట్‌వేగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయి తరలించేందుకు స్మగ్లర్లు అంతర్రాష్ట్ర సరిహద్దులను డంపింగ్ పాయింట్ మార్చుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ప్రాంతాలనే ప్రధాన కేంద్రాలుగా వాడుకుంటున్నారు. మరోవైపు ప్రత్యేక నిఘా పెడుతున్న పోలీసులు తరచూ వందల కిలోల సరకును స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా రవాణాదారులు వ్యుహాలు మార్చేస్తున్నారు. తద్వారా గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకే సవాలు విసురుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతంర మత్తు పదార్థాల వినియోగంపై కట్టడి చర్యలకు ఉపక్రమించింది. అక్రమ రవాణా, వినియోగాన్ని కట్టడి చేసేందుకు పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇచ్చింది. గంజాయి రవాణాపై నిఘా పెరగడంతో వ్యవస్థీకృత ముఠాలు పంథా మార్చుకుంటున్నాయి. పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తూ సరకును గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.
గంజాయి రవాణా చేస్తున్న వాహనాల డ్రైవర్లకు భారీ నజరానాలు ప్రకటిస్తున్నాయి. పోలీసులకు దొరకకుండా ఉండటానికి ప్రాంతానికో సెల్‌ఫోన్ వాడటం, సొంత చెక్‌పోస్టులు ఏర్పాటు వంటి వ్యూహాలు అనుసరిస్తున్నట్లు విచారణలో తెలింది. గంజాయి రవాణా కోసం పశ్చిమ బెంగాల్, కర్ణాటక, దిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన వాహనాలను వినియోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దాటే వరకు నకిలీ నెంబర్ ప్లేట్లను, తెలంగాణలోకి రాగానే ఇక్కడి నెంబర్ ప్లేట్‌ను బిగిస్తూ దర్జాగా సరిహద్దు దాటిస్తున్నారు.