Adulterated Food Across In Hyderabad :తక్కువ ధరలకు వస్తున్నాయని బజారులో దొరికే అల్లం పేస్ట్, కారం కొంటున్నారా! టీ బాగుంది కదా అని ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారా! అయితే మీరు ఓ సారి ఆలోచించాల్సిందే. హైదరాబాద్‌లో కల్తీ పదార్థాలు తయారు చేస్తున్న ముఠాల వ్యాపారాలు వీధివీధినా విస్తరించాయి. నివాసాల మధ్య కుటీర పరిశ్రమల ముసుగులో కల్తీ దందా చేస్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లను పెట్టుకొని కల్తీ పదార్థాలు అమ్ముకుంటూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవలె పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున కల్తీ పేస్ట్, టీ పొడి, మిరపకారం, పాల పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న కల్తీ రాయుళ్లపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రజలకు నిత్యం అవసరమయ్యే ఆహార పదార్థాలను కల్తీ చేసి ప్రముఖ బ్రాండ్ల పేరుతో భారీ ఎత్తున సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ బిర్యానీ కల్తీ : హైదారాబాద్‌లో బిర్యానీ అంటే ఫేమస్. తోపుడు బండ్ల నుంచి ప్రముఖ హోటళ్ల వరకు మాంసాహార వంటకాలదే హవా. వీకెండ్ వచ్చిందంటే చాలు బయటకు వెళ్లి బిర్యానీ రుచి చూడటం సాధారణం. తాజాగా సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో యాసిడ్ ఉపయోగించి కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఆరోగ్యానికి హానికలిగించే రసాయనాలతో దీన్ని తయారుచేస్తున్నట్లు నిర్ధారించారు.
రోజూ 1500 కిలోల కల్తీ అల్లం పేస్ట్ తయారు చేసి పలు హోటళ్లకు, దుకాణాలకు తక్కువ ధరకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వీటిలో కొన్ని సూపర్ మార్కెట్లు, 20కు పైగా ప్రముఖ హోటళ్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పాతబస్తీ, పహడీషరీఫ్, కాటేదాన్, మైలార్దేవ్ పల్లి, సికింద్రాబాద్, అత్తాపూర్, ఆసిఫ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో 60కు పైగా కల్తీ పదార్థాల స్థావరాలు ఉన్నట్లు పోలీసుల సమాచారం.