Police Arrest Gang Attempting to Commit Theft in Hyderabad: పెద్ద పెద్ద వేడుకల్లోకి అతిధులుగా వెళ్తారు. అందరితో కలిసి సరదాగా మాట్లాడుతున్నట్లు చేసి దొరికిందంతా దోచుకొని వెళ్తారు. వివాహ వేడుకల్లో దొంగతనాలు చేస్తూ దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన ముఠాను ఆదిభట్ల పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డితో కలిసి మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి శనివారం కేసు వివరాలు వెల్లడించారు.
పిల్లల్లో కలిసిపోయి చోరీ : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బోడా ఠాణా పరిధిలోని గుల్ఖేడీ, కడియా సాన్సీ, హల్ఖేడీ గ్రామాల్లో మెజార్టీ ప్రజల ప్రధాన వృత్తి దొంగతనాలు చేయడం. చిన్నారుల్లో దొంగతనాల నైపుణ్యం పెంచేందుకు ఇక్కడి ముఠాలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఈ మూడు గ్రామాల్లోనే దాదాపు 1200 మంది నేరస్థులు ఉంటారని తెలిపారు.
గుల్ఖేడీ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన అరుడ(38), అన్నాదమ్ములైన రిషి(19), అభిషేక్(25) ముగ్గురూ వేర్వేరు ప్రాంతాల్లో చిన్నపాటి చోరీలు చేసేవారు. దీంతో చిన్న చిన్న దొంగతనాలు కాకుండా ఒకేసారి పెద్దమొత్తంలో చోరీ చేయాలని స్కెచ్ వేశారు. ఇందుకు అరుడ తన సోదరుడి 12 ఏళ్ల కుమారుడిని ఎంచుకున్నాడు. ధనవంతుల వివాహాలు ఆడంబరంగా జరుగుతాయని అక్కడికి వచ్చే వారి బ్యాగులు కొట్టేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని పథకం వేశారు. నగర శివార్లలోని రిసార్టులో ఇలాంటివి జరుగుతాయని తెలుసుకుని సమీప బంధువు దగ్గర కారు అద్దెకు తీసుకుని ఈ నెల 12న నగరానికి వచ్చారు. ఇక్కడే మకాం వేసి రెండు రోజుల పాటు హైదరాబాద్-విజయవాడ, సాగర్ రహదారిపై కొన్ని ఫంక్షన్ హాళ్లలో చోరీకి యత్నించి విఫలమయ్యారు.