Gandhi Jayanti Celebrations In Telangana: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో ప్రముఖులు నివాళులర్పించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. నేటి తరానికి గాంధీ సిద్ధాంతాలు ఆచరణీయమన్న గవర్నర్ మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారానికి అందరూ పాటుపడాలని కోరారు.
CM Revanth Reddy Tributes Gandhiji: మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి బాపూఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన బాటలో నేటితరం నడవాలని సీఎం ఆకాంక్షించారు. జాతిపిత సిద్ధాంతాలు, ఆశయాలు యువతకు ఆచరణీయమని కొనియాడారు. బాపూఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహానికి మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ సభాపతి మధుసూదనాచారి, ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు నివాళులర్పించారు.
Kishan Reddy Tributes Gandhiji :సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ పరిసరాల్లో రహదారులు, వీధులను ఊడ్చి చెత్తను తొలగించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో పదేళ్ల కిందట ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని కేంద్రమంత్రి అన్నారు.
తెలంగాణ భవన్లో గాంధీ చిత్ర పటానికి నివాళులు :మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో గాంధీ చిత్ర పటానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్ముడి విగ్రహానికి మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.