Water Meter Problems in Greater Hyderabad : గ్రేటర్లో ఉచిత నీటి పథకానికి తిప్పలు తప్పడం లేదు. నల్లా మీటరు పెట్టుకున్న నల్లాదారుడికి జలమండలి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. వారు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఉచిత నీటి పథకం వర్తించదని తెగేసి చెబుతున్నారు. వారు చెప్పిందే ఫైనల్ రేటుగా జలమండలి సిబ్బంది చేతి వాటం చూపిస్తున్నారు. మీటరు ధర విషయంలో బహిరంగ మార్కెట్ కంటే మూడు రెట్లు ఉండటం గమనార్హం. గ్రేటర్లో చాలామంది వినియోగదారులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా గ్రేటర్లో ఉచిత నీటి పథకం వర్తించాలంటే ప్రతి నల్లాదారుడు తన ఆధార్ నంబర్‌ను కస్టమర్ అకౌంట్ నంబర్‌కు అనుసంధానం చేయాలి. అలాగే తప్పనిసరిగా నల్లాకు పెట్టిన మీటరు పని చేస్తూ ఉండాలి. ఇక్కడే కొత్త చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే చాలా మీటర్లు రిపేర్లు కావడం, పాడైపోవడంతో కొత్తవి అవసరం అవుతున్నాయి. మీటరు పాడైనా, కొత్త మీటరు పెట్టుకోవాలన్నా జలమండలి గతంలో 15 కంపెనీలను ఎం-ఫ్యానల్ చేసింది. వాటి నుంచే కొనుగోలు జరగాలని సూచించింది. ఇక్కడే ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఈ కంపెనీల మీటర్లు ఎక్కడ దొరకుతాయో చాలా మంది వినియోదారులకు తెలియడం లేదు.
మీటర్లకు భారీ మొత్తంలో వసూళ్లు : ఈ సమస్యనే కొందరు జలమండలి శాఖ సిబ్బంది అనుకూలంగా తీసుకొని అర అంగుళం నల్లా కలెక్షన్‌కు రూ.3 వేల వరకు మీటరు ధర ఉండగా, దాని కోసం సిబ్బంది రూ.6 నుంచి రూ.7 వేలు తీసుకుంటున్నారు. అదే బహుళ అంతస్థుల భవనాలకు అమర్చే ఏఎంఆర్ మీటర్లకు రూ.20 - రూ.30 వేల వరకు మార్కెట్లో ధర ఉండగా, కొందరు సిబ్బంది రూ.50 వేల పైనే డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ నల్లాదారుడు నల్లా బహిరంగ మార్కెట్లో కొని వేసుకున్నా రీడింగ్ తీయడానికి వచ్చే సిబ్బంది ఎన్నో కొర్రీలు పెడుతున్నారు. ఉచిత పథకం నుంచి మినహాయిస్తామని చెప్పి వినియోదారులకు షాక్‌లు ఇస్తున్నారు. దీంతో వారికి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.