Tomato Dosa Recipe in Telugu : టిఫెన్లలో ఎవరికైనా మొదటగా గురొచ్చేది దోశ. ఎక్కువ మందికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా అని చెప్పుకోవచ్చు. అయితే, నార్మల్గా డైలీ ఏ దోశ వేస్తాం? సాదా దోశ లేదంటే రవ్వ దోశ. మహా అయితే ఎగ్ దోశ. పైగా వీటిన్నింటికీ ముందే బోలెడు ప్రిపరేషన్ కావాలి. అలా కాకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా.. అదీ కాస్త వెరైటీగా ఉండాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ఒక సూపర్ రెసిపీ పట్టుకొచ్చాం. అదే.. "టమాటా దోశ". టేస్ట్ అద్దిరిపోతుంది! ఇంటిల్లిపాదికీ చాలా బాగా నచ్చేస్తుంది ఈ దోశ. పైగా తొందరగా పనవ్వడమే కాదు ఆరోగ్యానికీ మంచిది! ఇంతకీ, ఈ టేస్టీ టమాటా దోశల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యప్పిండి - 1 కప్పు
- ఉప్మారవ్వ - 1 కప్పు
- టమాటా ముక్కలు - 1 కప్పు
- శనగపిండి - అర కప్పు
- మజ్జిగ - రెండు కప్పులు
- కారం - చెంచా
- ఉప్పు - రుచికి సరిపడా
- పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర తరుగు - అర కప్పు
- అల్లం ముద్ద - అర చెంచా
- మిరియాల పొడి - అర చెంచా
- జీలకర్ర పొడి - అర చెంచా
- ఇంగువ - పావు చెంచా
చలికాలం ఇడ్లీ/దోశ పిండి చక్కగా పులియాలంటే - పప్పు నానబెట్టేటప్పుడు వీటిని ఒక స్పూన్ కలిపితే చాలట!
తయారీ విధానం :
- ముందుగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మొదటగా రెసిపీలోకి కావాల్సిన టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరను సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో బియ్యప్పిండి, ఉప్మారవ్వ, టమాటా ముక్కలు, శనగపిండి, కారం, ఉప్పు, మజ్జిగ, పచ్చిమిర్చిని తుంపి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై అందులో మరికొద్దిగా మజ్జిగ, అల్లం పేస్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ, ముందుగా తరుక్కొని పెట్టుకున్న సన్నని కొత్తిమీర తరుగు వేసి మిశ్రమం మొత్తం మంచిగా కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడిచేసుకోవాలి. పాన్ వేడయ్యాక కాస్త నూనె అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి.
- ఆపై అంచుల వెంబడి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే 'ఇన్స్టంట్ టమాటా దోశలు' రెడీ!
- ఇక ఈ దోశలను పల్లీ, టమాటా చట్నీతో తింటుంటే కలిగే ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ఇలా ట్రై చేయండి.
హోటల్ స్టైల్ "క్రిస్పీ దోశలు" - ఇంట్లోనే సులువుగా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ వేరే లెవల్!