Heavy Rain Alert in AP : ఏపీకి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులలో తుపానుగా రూపాంతరం చెందలేదని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కి.మీ దూరంలోనూ, నాగపట్టణానికి 340 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 470 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఇవాళ ఉదయం వరకు తీవ్ర వాయుగుండంగా సాగింది. ఇప్పుడు వాయుగుండంగా బలహీన పడిందని భారత వాతావరణ శాఖ చెప్పింది. వాయవ్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికల్లా కరైకల్ (పుదుచ్చేరి), మహాబలిపురం(తమిళనాడు) మధ్యలో తీరం దాటవచ్చని అంచనా వేసింది.
ఈ వాయుగుండం ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుపాను స్థితిని తెలుసుకోవడానికి ఇస్రో ఉపగ్రహాలు : మరోపక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిరంతరం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలను అందిస్తోంది. భారత్‌కు చెందిన ఇన్సాట్-3డీఆర్, ఈవోఎస్ -06 ఉపగ్రహాల ద్వారా ఎప్పటికప్పుడు ఫంగన్ తుపాను స్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్రో అందిస్తోంది. దీంతో విపత్తుల కట్టడికి ముందు చర్యలు తీసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఉపగ్రహాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇస్రో.. ఏపీ ప్రభుత్వాన్ని ఆలర్ట్ చేయగా వారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
గురువారం తీవ్ర వాయుగుండం : గురువారం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా సాగింది. అప్పుడు ట్రింకోమలీకి 100 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే నాగపట్నానికి 320 కి.మీ., పుదుచ్చేరికి 410 కి.మీ దూరంలో తీవ్రవాయుగుండం సాగుతుందని పేర్కొంది. మరికొద్ది గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు తొలగినట్లు.. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
మరికొన్ని గంటల్లో తీరం దాటనున్న తుపాన్ - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు