Former Prime Minister Manmohan Singh Expired :మన్మోహన్ సింగ్ కాస్త నెమ్మదైన మనిషే అయినా ఆయన ఆలోచనలు అమోఘం. దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే 2004 నుంచి 2014 వరకు దేశాన్ని సమర్థంగా ముందుకు నడిపించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే చోటుచేసుకున్నాయి.
సంస్కరణ వాదిగానే కాకుండా పరిపాలన దక్షుడుగా ఎన్నో చరిత్రాత్మక పథకాలకు మన్మోహన్ శ్రీకారం చుట్టారు. మన్మోహన్ సింగ్ పాలనాకాలంలోనే దేశంలో 3జీ, 4జీ సేవల ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ఆధార్ కార్డుల జారీ మొదలైందీ ఆయన హయాంలోనే. మన్మోహన్ సర్కారు గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారెంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది. సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రంలాంటి సమాచార హక్కును అందించింది.
సాహసోపేత నిర్ణయం ఆయనదే :దేశంలో 3 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు రూ.72 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికి దక్కుతుంది. రుణమాఫీపై ఆయన సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే 2009లో యూపీయే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ స్ఫూర్తితోనే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్లి గెలిచాయి. మన్మోహన్ హయాంలోనే విదర్భ, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు.
'భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది'- మన్మోహన్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం
అమెరికాతో అణు ఒప్పందం :భూసేకరణ చట్టాన్ని ఆధునికీకరించి ప్రభుత్వ పథకాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే బాధితులకు అధిక పరిహారం, పునరావాసం అందించేలా మన్మోహన్ చర్యలు తీసుకున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ఆయన హయాంలోనే అవతరించింది. తన మైనార్టీ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకొని హెచ్చరికలు జారీ చేసినా వెరవకుండా అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న ధైర్యశాలి మన్మోహన్. పార్టీ అధినాయకురాలిగా సోనియాగాంధీ బలంగా ఉన్నా, నేతలంతా ఆమె కనుసన్నల్లోనే నడుచుకున్నప్పటికీ ఎక్కడా తన మాటకు విలువ తగ్గకుండా, దేశ గౌరవాన్ని తగ్గించకుండా చాకచక్యంగా ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను నిర్వర్తించారు మన్మోహన్.