Fire Accident in TTD Administrative Building : తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. ప్రమాదంలో టీటీడీ పరిధిలోని స్దానిక ఆలయాలకు సంబంధించిన ఇంజినీరింగ్ దస్త్రాలు దగ్ధమయ్యాయి. మధ్యాహ్న భోజన విరామసమయంలో అగ్నిప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాద ఘటనపై విభాగంలో ఉన్న ఉద్యోగి నాగార్జున పరిపాలనా భవనంలోని కంట్రోల్‌రూంకు సమాచారమిచ్చారు. కంట్రోల్ రూం సిబ్బంది అగ్నిమాపకశాఖకు ఫిర్యాదు చేయడంతో అగ్నిమాపక విభాగ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మంటలు తక్కువస్థాయిలో ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి టీటీడీ సిబ్బంది మంటలను అర్పివేశారు.
ప్రమాదవశాత్తూ జరిగిందా? కుట్రకోణమా? :ఇంజనీరింగ్ విభాగ అసిస్టెంట్ ఇంజినీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా కుట్రకోణం ఉందా? అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అగ్ని ప్రమాదం జరిగిన పరిపాలన భవనం ఇంజనీరింగ్ సెక్షన్ ను టీటీడీ నిఘా, భద్రతా విభాగ ముఖ్య అధికారి (CVSO) శ్రీధర్ పరిశీలించారు.
అనంతరం సీవీఎస్ఓ మీడియాతో మాట్లాడుతూ, అగ్నిప్రమాదంలో టీటీడీ పరిధిలోని పలు ఆలయాలు, రహదారులకు సంబంధించి దస్త్రాలు తగులపడినట్లు గుర్తించామన్నారు. ప్రమాదంలో దస్త్రాలు తగులపడినా ఈ ఫైలింగ్ ఉండటంతో డేటా అందుబాటులో ఉంటుందంటున్నారు. అగ్ని ప్రమాదం ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు.