Film celebrities pay tribute to Ramoji Rao : సినీరంగంలో అద్భుతాలు సృష్టించిన రామోజీరావు, తుదిశ్వాస విడవడం తీరని లోటని సినీప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్ధీవదేహానికి నివాళులర్పించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
నటులు, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, దర్శక, నిర్మాతలు అశ్వినీదత్, దగ్గుబాటి సురేష్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్రీనువైట్ల, క్రిష్ నివాళులు అంజలి ఘటించారు. రామోజీరావు లేకున్నా, ఆయన ప్రస్థానం మాత్రం చిరస్థాయిగా నిలిచే ఉంటుందన్నారు. జర్నలిజం, సినిమా రంగాల్లో రామోజీరావు చరిత్ర సృష్టించారని ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ స్పష్టం చేశారు. రామోజీరావు పార్థీవ దేహానికి ఇళయరాజా, మోహన్ బాబు, మంచు విష్ణు, హీరోలు వెంకటేశ్, నాగార్జున, కల్యాణ్‌రామ్, రఘుబాబు, తరుణ్ నివాళులర్పించారు.
సంగీత దర్శకులు కోటి, కీరవాణి, దర్శకులు రాజమౌళి, తేజ, సినీ గీతరచయితలు పరుచూరి గోపాలకృష్ణ, చంద్రబోస్, సినీ కథారచయిత విజయేంద్రప్రసాద్ సహా పలువురు ప్రముఖులు భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు ఎందరికో మార్గదర్శిగా నిలిచారని కోనియాడారు. వెండితెరతో పాటు బుల్లితెరకు రామోజీరావు సేవల్ని తలుచుకుని సీరియల్ నటీనటులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఎంతోమందికి జీవనోపాధి కల్పించారని భావోద్వేగానికి గురయ్యారు.
రామోజీరావు మరణం చాలా బాధాకారం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయనలోటు తీర్చలేనిది. రాబోయే తరాలకు రామోజీరావు ఒక మార్గదర్శి. ఆయన జీవితాంతం విలువలను పాటిస్తూ, ఆదర్శంగా నిలిచారు. - రాజేంద్రప్రసాద్ సినీనటుడు