Posani Krishna Murali Viral Decision on Politics :సినీ నటుడు పోసాని కృష్ణ మురళి జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడను అని సంచలన ప్రకటన చేశారు. ఇవాళ మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోపాటు నారా లోకేశ్‌ను అసభ్యకరంగా దూషించారన్న అభియోగాలపై వైసీపీ నేతగా ఉన్న పోసానిపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో పలు స్టేషన్లోనూ ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని ఏకవచనంతో సంబోధిస్తూ తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారని పోసాని కృష్ణ మురళి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని టీడీపీ నేతలు మండిపడ్డారు.
పోసానిపై అనంతపురం, బాపట్ల, తిరుపతి జిల్లా పుత్తూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట, చిత్తూరు జిల్లా యాదమరిలో పోలీసు స్టేషన్ల్లో ఫిర్యాదు అందాయి. ఈ క్రమంలో పోసాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ పక్రటన చేయడం గమనార్హం. తాను రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అందర్ని విమర్శిస్తుంటానని, నాయకుల నీతి, నిజాయతీలు, నడవడి ఆధారంగానే వ్యాఖ్యలు చేస్తుంటానని పోసాని కృష్ణ మురళి అన్నారు. కానీ తాను మంచి నాయకుడిని విమర్శింలేదని పేర్కొన్నారు. ప్రధాని తనకు ఎప్పటి నుంచే తెలుసని, ఆయన జీవితంలో అవినీతి లేదని పేర్కొన్నారు.
తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని విమర్శించా : మోదీ మంత్రి స్థాయి నుంచి ఎదిగి దేశ ప్రధాని అయ్యారని, ఆయన ఎప్పుడు నిజాయతీగా మాట్లాడతారని పోసాని తెలిపారు. ఇన్నేళ్ల కాలంలో మోదీ కోట్ల రూపాయ ఆస్తులు కూడగట్టారని ఎవరైనా అన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కూడా అలాంటి విమర్శలు చేయలేదని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఇవా ఎవరినీ తాను విమర్శించలేదని పేర్కొన్నారు. ఏపీలో చంద్రబాబు, జగన్, ఎన్టీఆర్, రాజశేఖర్‌రెడ్డి ఇలా అందరినీ వారి గుణగణాలను సపోర్ట్ చేసినట్లు వ్యాఖ్యాంచారు. తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని విమర్శించినట్లు చెప్పారు.