Farmers Protest Over Dharani Portal Technical Issues :ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు, తప్పుల తడకలు సరిదిద్దాలంటూ మహబూబాబాద్ జిల్లా రైతులు సచివాలయం వద్ద ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన కేసముద్రం మండలం నారాయణపురం రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ధరణిలో నమోదు చేసిన తమ వివరాల్లో అన్ని దోషాలు ఏర్పడ్డాయని ఆరోపించారు.
ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలను అనేక మార్లు సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు తెలిపారు. ఆ కార్యాలయం ఎదుట ధర్నాలు చేసినా ఎలాంటి ఫలితం లేదని ఆక్షేపించారు. రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రైతు పేరు : అడవి, తండ్రి పేరు : అడవి అని నమోదు చేయడటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ధరణి కమిటీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం అని ధ్వజమెత్తారు.
గ్రామంలో మొత్తం 1900 ఎకరాల భూమి ఉంటే, 700 ఎకరాలకు పట్టాలు ఇచ్చిన రెవెన్యూ శాఖ అధికారులు మిగిలిన 1200 ఎకరాలకు ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. అందువల్ల రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం, రైతు చనిపోతే రైతు బీమా పథకం ఏమీ వర్తించడం లేదని మండిపడ్డారు. ఇంట్లో కూతురు పెళ్లి కట్నం కోసం భూమి అమ్ముదామంటే పట్టాలు లేకపోవడంతో ఏ రైతు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని వాపోయారు.