Farmers on Loan Waiver Issues : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అన్నదాతకు రుణమాఫీ కష్టాలు తీరడం లేదు. తీరా రుణాలు మాఫీ అయ్యే సమయంలో సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఒక్కసారిగా ఖాతాల్లో సొమ్ము జమ కావడం ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు జిల్లాల్లోనూ రుణాల మాఫీకి తమకు అన్ని అర్హతలు ఉన్నా కాలేదంటూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంలో కర్షకుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతుండటంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అందించేందుకు భరోసా ఇచ్చేలా కార్యాచరణకు సిద్ధమయ్యారు.
మండలాల వారీగా ప్రత్యేక డ్రైవ్‌లు :ఈ మేరకు ఉభయ జిల్లాల్లో మండలాల వారీగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. రైతు వేదికలు, మండల వ్యవసాయశాఖ అధికారుల కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారుల్ని నియమించారు. రైతుల సమక్షంలోనే ఆన్‌లైన్‌లో ఆధార్ నెంబర్ ఆధారంగా పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను రైతులకు వివరిస్తున్నారు. వారి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు.
'నేను రూ.28వేలు వ్యవసాయ రుణం తీసుకున్నాను. ఇక్కడకి వస్తే మాఫీ అయిందని మొదట చెప్పారు. ఆ తర్వాత కాలేదన్నారు. ఈవో దగ్గరకి వెళ్లాలని చెప్పారు. ఇక్కడకి వస్తే రుణమాఫీ కాలేదంటున్నారు. అక్కడకీ వెళ్లు ఇక్కడికి వెళ్లు అని చెప్పడం తప్ప పనిమాత్రం కావడం లేదు' అని ఓ రైతు వాపోయారు.
రుణమాఫీ సమస్యల పరిష్కారం దిశగా :ఈ ప్రత్యేక డ్రైవ్లో లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు దరఖాస్తుల్ని యంత్రాంగం వెంటనే వ్యవసాయ శాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్ చేయనున్నారు. తర్వాత ఉన్నతాధికారులు దరఖాస్తుల్ని స్వయంగా పరిశీలించి రుణాల మాఫీకి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు. వీటిలో ప్రధానంగా ఆధార్ నెంబర్లలో తప్పులు, పాసు పుస్తకాలు లేకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, కుటుంబ నిర్ధారణ కాకపోవడం వంటి కారణాలు ఆన్‌లైన్‌లో చూపుతున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.