Tirumala April Quota Tickets 2025 : తిరుమల భక్తులకు గుడ్న్యూస్. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల (సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాదపద్మారాధన) కోటా నేడు విడుదల కానుంది. ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవలకు సంబంధించి లక్కీ డిప్ కోసం సోమవారం (ఈ నెల 20) ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మరోవైపు సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ టికెట్లు, ఏప్రిల్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం 3 గంటలకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల చేయనున్నారు.
27న ఉదయం 11, 12, ఒంటి గంటకు శ్రీవారి సాధారణ, నవనీత, పరకామణి సేవల కోటాలు విడుదల చేస్తారు. ఈ మేరకు భక్తులు గమనించి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.