How to Do Head Bath Properly: జుట్టు తత్వం ఎలా ఉన్న సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తుంటారు. మరికొందరు వారానికోసారి మాత్రమే జుట్టును శుభ్రం చేసుకుంటారు. అయితే, అందరూ ఒకేలా కాకుండా జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, రాలిపోవడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సెమీ కర్లీ హెయిర్
సెమీ కర్లీ హెయిర్ ఉన్న వారు వారంలో రెండు లేదా మూడుసార్లు తలస్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీ జుట్టు బాగా ఒత్తుగా ఉన్నట్లయితే వారానికి రెండుసార్లు చేసినా సరిపోతుందని అంటున్నారు. అయితే ఈ క్రమంలో నూనె ఆధారిత షాంపూలను ఎంచుకోకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే వీటివల్ల జుట్టు సహజమైన కర్లీనెస్‌ని కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూలను ఎంచుకుంటే జుట్టుకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తపడచ్చని వివరిస్తున్నారు.
కర్లీ హెయిర్
కర్లీ హెయిర్ కావాలని ప్రతి ఒక్క అమ్మాయీ కోరుకుంటుంది. కర్లీ హెయిర్ ఉంటే జుట్టు కాస్త పలుచగా ఉన్నప్పటికీ.. ఒత్తుగా ఉన్నట్లు కనిపిస్తుందని అందరూ కోరుకుంటారు. అంతేకాదు.. ఇలా ఉండడం వల్ల కురులు అలల్లా ఎగురుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే, ఉంగరాల జుట్టున్న వారికి జుట్టు త్వరగా పొడిబారిపోతుందనని వివరిస్తున్నారు. కాబట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే కురులు తేమను కోల్పోకుండా పట్టులా ఉండాలంటే తలస్నానం చేసే గంట లేదా రెండు గంటల ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు నూనెతో మసాజ్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
పొడి జుట్టా?
ముఖ్యంగా పొడిబారిన జుట్టు ఉన్న వారి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి జుట్టున్న వారు తమ కేశాలకు రంగు వేసుకున్నా, హెయిర్ డ్రయర్స్ వాడినా జుట్టు గడ్డిలా మారడం, అలర్జీలు, కుదుళ్లలో దురద వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా జుట్టు చివర్లు చిట్లడం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు నిర్జీవమైపోవడం వంటి సమస్యలూ ఇబ్బంది పెడుతుంటాయని వివరిస్తున్నారు. అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే సహజసిద్ధమైన షాంపూలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో హానికారక రసాయనాలు ఉండవు కాబట్టి జుట్టుకు ఎలాంటి డ్యామేజ్ అయ్యే అవకాశమే ఉండదని అంటున్నారు. అలాగే పొడి జుట్టు ఉన్న వారు వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో బాగా వేడిగా ఉండే నీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లను ఉపయోగించడం మంచిదని సలహా ఇస్తున్నారు. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు-కాయగూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుందని వివరిస్తున్నారు.
ఆయిలీ హెయిర్
మన తలలో ఉండే నూనె గ్రంథులు అధికంగా నూనెలను ఉత్పత్తి చేయడం వల్ల కుదుళ్లు, జుట్టు జిడ్డుగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా చుండ్రు, దురద సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. కాబట్టి ఆయిలీ హెయిర్ ఉన్న వారు రోజు విడిచి రోజు తలస్నానం చేయక తప్పదని సూచిస్తున్నారు. అలాగే నూనె ఆధారిత షాంపూలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చరిస్తున్నారు. కండిషనర్‌ను కూడా జుట్టు చివర్లకు మాత్రమే రాసుకోవాలని.. తద్వారా కుదుళ్లలో అధిక నూనె ఉత్పత్తి కాకుండా నియంత్రించచ్చని అంటున్నారు. 2018లో Skin Appendage Disorders జర్నల్‌లో ప్రచురితమైన "The Effect of Frequent Washing on Oily Hair" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? రోజూ ఇలా చేస్తే బ్యూటిఫుల్‌గా కనిపిస్తారట!
మీ ముఖం జిడ్డుగా ఉంటుందని బాధపడుతున్నారా? సింపుల్ హోమ్ టిప్స్ పాటిస్తే ఆయిల్ స్కిన్ పోతుందట!