EPFO Pension With 10 Years Service : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఆధ్వర్యంలో ఉద్యోగుల పింఛను పథకం (EPS) అమలవుతుంటుంది. 1995 సంవత్సరం నవంబరు 16 నుంచి అమలవుతున్న ఈ పథకం ద్వారా ఉద్యోగులు ప్రతినెలా పింఛను పొందొచ్చు. నెలవారీ పింఛను ఎంత ఉండాలి? అనేది సదరు ఉద్యోగి పనిచేసిన కాలం, పొందిన వేతనం ఆధారంగా నిర్ణయమవుతుంది. కనీసం పదేళ్లు ఉద్యోగం చేసిన వారు మాత్రమే ఈపీఎస్ పింఛనుకు అర్హులు. ఉద్యోగి కంపెనీలో పనిచేసినన్ని నాళ్లు ఈపీఎస్ పథకానికి ప్రతినెలా చెల్లింపులు చేయాలి. ఉద్యోగి మూల వేతనం (బేసిక్ పే) నుంచి 12 శాతాన్ని, అంతే సమానమైన మొత్తాన్ని సంబంధిత కంపెనీ బ్యాంకు ఖాతా నుంచి ప్రతినెలా ఈపీఎస్ పథకానికి చెల్లించాలి. కంపెనీ చెల్లించే 12 శాతం మొత్తంలో 8.33 శాతాన్ని ఈపీఎస్‌కు, 3.67 శాతాన్ని ఈపీఎప్ పథకానికి మళ్లిస్తారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి కనిష్ఠంగా ప్రతినెలా రూ.1,000, గరిష్ఠంగా ప్రతినెలా రూ.7,500 దాకా పింఛన్‌ను అందిస్తారు. అయితే 58 ఏళ్ల వయసు నుంచి ఈ పింఛను లభిస్తుంది. సంఘటిత రంగాల్లో పనిచేసే ఉద్యోగులు పదవీ విరమణ పొందాక ఈపీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందొచ్చు. అయితే పదేళ్లు మాత్రమే పనిచేశాక, పింఛను ఎంత వస్తుంది? ఈపీఎస్ నెలవారీ పింఛన్‌ను లెక్కవేసే ఫార్ములాను మనం ఇప్పుడు చూద్దాం.
- నెలవారీ పింఛను = (చివరి 60 నెలల వేతనపు సగటు మొత్తం × ఈపీఎస్‌కు చెల్లింపులు చేసిన సంవత్సరాలు) / 70
- ఉదాహరణకు ఒక ఉద్యోగికి చెందిన చివరి 60 నెలల వేతనపు సగటు మొత్తం రూ.15వేలు ఉందని భావిద్దాం. అతడు సరిగ్గా పదేళ్ల పాటు ఉద్యోగం చేశాడని అనుకుందాం. అలాంటప్పుడు నెలవారీ పింఛను ఎంత వస్తుందంటే => (రూ.15,000 × 10) / 70 = రూ.2,143.
- ఒకవేళ ఎవరైనా ఉద్యోగి పదేళ్లకు మించి ఉద్యోగం చేస్తే వారికి వచ్చే నెలవారీ పింఛను మొత్తం మరింత పెరుగుతుంది.
ఈపీఎస్ పింఛన్ రకాలు
- సూపర్ యాన్యుయేషన్ పింఛను : 58 ఏళ్లు నిండాక ఈ పింఛను లభిస్తుంది.
- ఎర్లీ పెన్షన్ : 50 నుంచి 58 ఏళ్లలోపు వారికి ఈ పింఛను లభిస్తుంది. అయితే కొన్ని కత్తిరింపులు జరుగుతాయి.
- వితంతు పింఛను : చనిపోయిన ఉద్యోగికి చెందిన జీవిత భాగస్వామికి ఈ పింఛను లభిస్తుంది.
- బాలల పింఛను : చనిపోయిన ఉద్యోగికి చెందిన పిల్లలు ఈ పింఛనుకు అర్హులు.
- అనాథ పింఛను : తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన వారికి ఈ పింఛను లభిస్తుంది.
- దివ్యాంగ పింఛను : శాశ్వత వైకల్యం కలిగిన వారికి ఈ పింఛను ఇస్తారు.
ముందస్తు పింఛను ఎలా?
కొంత మంది 58 ఏళ్ల కంటే ముందే తమకు నెలవారీ ఈపీఎస్ పింఛను (ఎర్లీ పెన్షన్) రావాలని కోరుకుంటారు. ఈ విధంగా పింఛను రావాలని భావించే ఉద్యోగులకు కనీసం 50 ఏళ్ల వయసు ఉండాలి. కనీసం పదేళ్లు ఉద్యోగం చేసి ఉండాలి. ముందస్తు పింఛను తీసుకుంటే ప్రతి సంవత్సరం పింఛను మొత్తంలో 4 శాతం మేర కత్తిరింపు జరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి. దీనివల్ల మనకు రావాల్సిన నెలవారీ పింఛను మొత్తం గణనీయంగా తగ్గిపోతుంది. అలా కాకుండా ఈపీఎస్ పింఛను పెరగాలంటే, దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీరు ఉద్యోగం చేసిన కాలం సాధ్యమైనంత ఎక్కువగా ఉండాలి. ఇది ఎంత ఎక్కువగా ఉంటే మీకు వచ్చే పింఛను మొత్తం అంత ఎక్కువగా ఉంటుంది. పదవీ విరమణ పొందే సమయానికి మీ నెలవారీ వేతనం ఎంత ఎక్కువగా ఉంటే అంతమేర పింఛను పెరుగుతుంది. ఉద్యోగ కాలంలో మధ్యలో విరామం అనేది లేకుండా ప్రతినెలా ఈపీఎస్ స్కీంలో పింఛను డబ్బులు జమ అయితే చాలా మంచిది. మీరు పనిచేసే కంపెనీ అవకాశమిస్తే ‘హయ్యర్ పెన్షన్ స్కీం’కు అప్లై చేసుకోండి. తద్వారా మీకు వచ్చే వేతనం నుంచి ప్రతినెలా కాస్త ఎక్కువ మొత్తాన్ని ఈపీఎస్ చెల్లింపు కోసం కేటాయించుకోవచ్చు. ఈ టిప్స్‌ను పాటిస్తే రిటైర్మెంట్ తర్వాత మీకు ప్రతినెలా ఆకర్షణీయమైన పింఛను చేతికి అందుతుంది. ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లోకి వెళ్లి మీరు ఈపీఎస్ పింఛను గురించి చెక్ చేయొచ్చు.
ఈపీఎస్ ప్రయోజనాలు
- ఈపీఎస్ ద్వారా జీవితాంతం ప్రతినెలా ఆదాయంలా పింఛన్‌ను పొందొచ్చు.
- ఒకవేళ ఈపీఎస్ సభ్యుడు చనిపోతే, కుటుంబానికి/నామినీకి పింఛను లభిస్తుంది.
- ఈపీఎస్ సభ్యుడికి ఒకవేళ వైకల్యం వస్తే అదనంగా పింఛను లభిస్తుంది.
- పన్ను ప్రయోజనాలను పొందొచ్చు. ఈపీఎస్ పింఛనుకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంది.
పింఛన్‌దారులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్- ఇకపై ఎక్కడినుంచైనా పింఛన్ తీసుకోవచ్చు
EPFO UAN పేరు తప్పుగా పడిందా? నో ప్రాబ్లమ్- ఈ 3 డాక్యుమెంట్లు ఉంటే సింపుల్‌గా ఛేంజ్ చేయొచ్చు!