How to Stop Burping Naturally: మనలో చాలా మంది భోజనం చేయగానే.. బ్రేవ్ బ్రేవ్ మంటూ తేన్పులు తీస్తుంటారు. నోటితో గాలిని పీల్చుకోవటం, ఆహారం జీర్ణమయ్యే సందర్భాల్లో కడుపులో గ్యాస్ పేరుకుపోతుంటుందన్నారు నిపుణులు. ఇది బయటకు రావటానికి ప్రయత్నించటం వల్లే తేన్పులు వస్తుంటాయని అంటున్నారు. అయితే, నలుగురిలో ఉన్నప్పుడు పదే పదే తేన్పులు వస్తుంటే మాత్రం చాలా అసౌకర్యానికి గురవుతారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం: జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఔషధ గుణాలు కడుపుబ్బరం, తేన్పులను తక్షణమే నివారిస్తుందని అంటున్నారు. రోజుకు రెండు లేదా మూడుసార్లు చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల తేన్పుల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చని సలహా ఇస్తున్నారు. ఇంకా అల్లాన్ని నేరుగా తీసుకునేందుకు ఇబ్బంది పడేవారు తేనె లేదా పంచదారతో కలిపి తీసుకోవచ్చని సూచిస్తున్నారు. 2018లో European Journal of Gastroenterology and Hepatologyలో ప్రచురితమైన "The effect of ginger extract on gastric emptying and belching" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కల్ని తీసుకొని నీటిలో వేసి ఓ పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి, అందులో కొంచెం నిమ్మరసం లేదా తేనెను కలుపుకొని తాగాలి. ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే తేన్పుల నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చని అంటున్నారు.
బొప్పాయి: తేన్పుల సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో బొప్పాయి బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ‘పపైన్’ అనే ఎంజైమ్.. జీర్ణవ్యవస్థ, గ్యాస్ సంబంధిత సమస్యలను దూరం చేస్తుందని వివరిస్తున్నారు.
పెరుగు: పెరుగులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమై, కడుపుబ్బరం వంటి సమస్యలను దూరం చేసే మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడంలో పెరుగు సమర్థంగా పనిచేస్తుందని అంటున్నారు. ఈ క్రమంలోనే పెరుగుతో తేన్పుల సమస్యను కూడా త్వరితగతిన తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడి, తేన్పులతో పాటు ఇతర పొట్ట సంబంధిత సమస్యలను కూడా నయం చేసుకోవచ్చని వివరిస్తున్నారు.
సోంపు గింజలు: మనలో చాలా మందికి భోజనం చేయగానే సోంపు గింజలను తీసుకోవడం అలవాటు ఉంటుంది. వీటిని తినడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తేన్పుల సమస్యను తగ్గించడంలోనూ సోంపు ప్రభావవంతంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇంకా జీర్ణక్రియ సాఫీగా జరిగి కడుపుబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని వివరిస్తున్నారు. ఒకవేళ మీకు సోంపును నేరుగా తీసుకోవడం ఇష్టం లేకపోతే.. ఒక కప్పు నీళ్లలో బరకగా దంచుకున్న సోంపును వేసి కాసేపు మరగనివ్వాలట. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి తీసుకుంటే తేన్పుల సమస్య నుంచి విముక్తి పొందచ్చని నిపుణులు అంటున్నారు. ఈ చిట్కాను రోజుకు రెండుసార్లు పాటిస్తే ఫలితం ఉంటుందని వెల్లడిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పింక్ సాల్ట్ ఎందుకు మంచిది? గులాబీ రంగు ఉప్పులో 80 రకాల మినరల్స్! ఎన్నో హెల్త్ బెనిఫిట్స్!!
'జొన్న రొట్టెలు తింటే షుగర్ కంట్రోల్'- అధిక బరువు, గుండె సమస్యలకు చెక్!