Two Died Due to Electric Shock : హైదరాబాద్ హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ భవనానికి ఉన్న హోర్డింగ్‌ను దింపే క్రమంలో విద్యుదాఘాతంతో మంటల్లో కాలి ఇద్దరు మృతి చెందారు. సైంటిస్ట్ కాలనీలో శుభ నందిని చిట్‌ఫండ్ సంస్థను ఓ భవనంలో నిర్వహించేవారు. ఇటీవలే సంస్థను మూసి వేసి, భవనాన్ని ఖాళీ చేశారు. ఈ క్రమంలోనే భవనానికి ఉన్న హోర్డింగ్ తొలగించాలని శుభనందిని చిట్‌ఫండ్ ప్రతినిధులకు యాజమాని తెలిపారు. దీంతో ఆ హోర్డింగ్ తొలగించడానికి రూ.1000 ఇస్తామని బాలు అనే వ్యక్తితో బేరం కుదుర్చుకున్నారు.
దానికి ఒప్పుకున్న బాలు తోడు కోసం తన బంధువైన మల్లేశ్‌ను పిలిచాడు. ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి రెండో అంతస్తు ఎక్కి హోర్డింగ్‌కు తాళ్లు కట్టి దించేందుకు ప్రయత్నించారు. హోర్డింగ్ ఒక వైపునకు జారి పక్కనే ఉన్న 11 కేవీ ఎలక్ట్రిక్ వైర్లపై పడింది. హోర్డింగ్ పట్టుకుని ఉన్న ఇద్దరికి విద్యుత్ షాక్ తగిలి మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారొచ్చి మంటలు ఆర్పేశారు.
ఘటనా స్థలంలోనే చనిపోయిన బాలు, మల్లేశ్ మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడు బాలుది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి కాగా, మల్లేశ్‌ది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దేవునిగుట్ట తండా. విద్యుదాఘాతంతో ఇద్దరు దుర్మరణం చెందడంతో స్థానికంగా విషాదం అమలుకుంది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
మేడ్చల్ పెట్రోల్ దాడి కేసు - చికిత్స పొందుతూ యువకుడి తండ్రి మృతి