Jurala project will be filled with silt: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జలప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. కానీ ఏటా పేరుకుపోయే పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో ఆయకట్టుపై అది తీవ్రప్రభావం చూపుతోంది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతుండడంతో... రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. రెండు పంటలకు పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందాల్సిన చోట నీటి నిల్వ లేక రెండో పంటకు సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన జలవనరు జూరాల ప్రాజెక్టు. జూరాల నిండితేనే నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు సాగునీరు అందేది. అలాంటి జూరాల జలాశయం ప్రధాన క్రస్ట్‌గేట్ల దిగువన స్లూయిజ్‌లు లేకపోవటంతో, ఏటా పైనుంచి వస్తున్న వరద కారణంగా ప్రాజెక్టులో పూడిక పేరుకుపోతోంది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ పదేళ్ల క్రితం 11.94 టీఎంసీలు కాగా పూడిక కారణంగా దీన్ని నీటిపారుదల శాఖ అధికారులు 2013లో 9.657 టీఎంసీలకు తగ్గించారు. అప్పట్లోనే పూడిక వల్ల జలాశయంలో నీటినిల్వ 2.283 టీఎంసీలు తగ్గిపోయింది. నీటి నిల్వ సామర్ధ్యం తగ్గడం వల్ల వానాకాలంలో రైతులకు ఇబ్బందులు ఏర్పడకపోయినా.. రబీలో ఐదారేళ్ల నుంచి సాగునీటి కష్టాలు తప్పటం లేదు.
గతేడాది జలాశయంలో నీటినిల్వ లేక ఏకంగా యాసంగిలో పంటవిరామం ప్రకటించాల్సిన పరిస్ధితి ఎదురైంది. పదేళ్లకోసారి పూడిక సమస్య కారణంగా గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం తగ్గించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదే కొనసాగితే భవిష్యత్తు పాలమూరు జిల్లాలోని ప్రధాన ఎత్తిపోతల పథకాలకు, తాగునీటి వనరులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ఇప్పటికే ఎత్తిపోతల పథకాల కింద కేవలం ఓ పంటకే నీరందిచాల్సిన పరిస్థితి ఉంది. రెండోపంటకు విరామం ప్రకటిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న జలప్రదాయని మనుగడకు పూడిక ముప్పుగా మారుతోంది. ప్రభుత్వం పూడికపై దృష్టి సారించి నీటి నిల్వలు పెంచేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
'ప్రాజెక్టులో నీటినిల్వ తగ్గింపు కారణంగా ఆయకట్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చిన నీళ్లు నిల్వ ఉంచలేక, జూరాలపై అధారపడ్డ ఇతర ఎత్తిపోతల పథకాలకు సైతం నీరందించలేని పరిస్థితి నెలకొంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేవిధంగా కృషి చేస్తాం.'బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే