Fabricated Mobile House Trending in Hyderabad : సామాన్యుడి సొంతింటి కల, కలగానే మిగిలిపోతుంది. పిట్ట గూళ్లలాంటి అద్దె ఇళ్లలోనే కాలం గడుస్తోంది. అప్పులు చేసి, ఇల్లు కట్టుకుందామంటే తిప్పలు తప్పడం లేదు. సొంత స్థలం ఉన్నా, ఇంటి నిర్మాణానికయ్యే ఖర్చులు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ ఒత్తిళ్లు ఏవీ లేకుండా ఇంటిని నిర్మించుకోవచ్చని సేవకుల స్రవంతి అన్నారు.
Heavenly Mobile Houses :విదేశాల తరహాలో హైదరాబాద్‌లో ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ ఇళ్లు నిర్మిస్తూ వినియోగదారుల మన్ననలు అందుకుంటున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, కోరిన డిజైన్లలో ఇంటిని నిర్మించి కోరుకున్న ప్రదేశానికి తరలిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన స్రవంతి ఎంబీఏ పూర్తి చేసి, ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశారు. సొంతిల్లు నిర్మించుకునే క్రమంలో, ప్రీ-ఫ్యాబ్రికేడెట్ పద్ధతి గురించి తెలుకున్నారు. తాను ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా, 2018లో 'హెవెన్లీ మొబైల్ హౌస్' పేరుతో సంస్థ స్థాపించారు.
"నాకోసం నేను ఇళ్లు ఒకటి నిర్మించాలనుకొని, సివిల్ వర్కర్స్‌ను కలవటం జరిగింది. అప్పుడు వాళ్లు నిర్మాణానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం అడిగారు. కానీ నాకొక నెలలోనే ఇళ్లు కావాలనుకున్న, అప్పుడు దానికోసం సెర్చ్ చేసి, విదేశాల్లో కనిపించే వుడ్ హౌజ్‌లపై అధ్యయనం చేశాను. సివిల్ కంటే తక్కువ ఖర్చులో, అంతకంటే నాణ్యతగల ఇంటి నిర్మాణాన్ని చేశాను. అదే ప్రజలకు సైతం అందించటం జరుగుతుంది. ఇప్పటివరకు 200 నుంచి 300 ఇళ్ల నిర్మాణం చేపట్టాను."-సేవకుల స్రవంతి, హెవెన్లీ మొబైల్ హౌస్
ఆరేళ్లుగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ హౌస్‌ల తయారీ : స్రవంతి అందించే ఈ మొబైల్ హౌస్‌లకు హైదరాబాద్‌లో డిమాండ్ పెరిగింది. ఫామ్ హౌస్‌లు, వ్యక్తిగత గృహాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల కోసం వీటిని సరఫరా చేస్తున్నారు. సాధారణ ఇళ్లకు ఏమాత్రం తగ్గకుండా, నాణ్యతతో నిర్మించి ఇస్తున్నామని స్రవంతి చెబుతున్నారు. కూకట్‌పల్లిలో వర్క్‌షాప్ ఏర్పాటు చేసి, 40మందికి స్రవంతి ఉపాధి కల్పిస్తోంది.