Ex Minister Jagadish Reddy on Electricity Inquiry Commission : విద్యుత్‌కు సంబంధించిన నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైందని కేసీఆర్ విషయంలో ఏమీ తేల్చలేమని చెప్పి ప్రభుత్వం దొంగల్లాగా లీకులు ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తే దురదృష్టవశాత్తు కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టారని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. సర్కార్ లీకులను సమర్థించేలా నేడు కొందరితో మాట్లాడించారని ఆక్షేపించారు. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరిగిందని అన్నారు. ఆ ఒప్పందం లేకపోయి ఉంటే విద్యుత్ కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఉత్తర భారతం నుంచి కరెంటు తీసుకోకుండా కేసీఆర్ ఫెయిల్ అయితే మళ్లీ సమైక్య రాష్ట్రంలో కలపాలన్నది వారి కుట్ర అని ఆరోపించారు.
అవినీతి జరిగి ఉంటే అప్పటి సీఎం రమణ్ సింగ్, కాంగ్రెస్ సీఎంలు డబ్బులు ఇచ్చారా అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో విద్యుత్ కేంద్రం ఎందుకు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామని ఘాటుగా వ్యాఖ్యానించారు. నల్గొండ జిల్లా తెలంగాణలో లేదానని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా దద్దమ్మ నేతలు నాటి లాగే ఇప్పుడు కూడా నోరెత్తకుండా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గతంలో యాదాద్రి విద్యుత్ కేంద్రం బంద్ చేయిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోషం ఉంటే ప్రారంభోత్సవానికి పోకూడదని సవాల్ విసిరారు.