Sankranti Celebrations in Tamilnadu : సంక్రాంతి పండగ అంటే ఎన్నో సంబరాలు, మరెన్నో సంతోషాలు. వీటితోపాటు ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు కూడా. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్నట్టుగానే పొరుగు రాష్ట్రం తమిళనాడులో కూడా సంక్రాంతి వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇక్కడి ఒక సంప్రదాయం వైవిధ్యంగా ఉంటుంది. శివగంగై జిల్లాలోని సలుగైపురం ఊళ్లో భిన్నమైన పద్ధతిలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తారు.
ఇక్కడ ఒక వర్గం జనానికి ప్రత్యేకమైన కులదేవతలు ఉన్నారు. వారే పచ్చైనాచ్చి బిటారి, పొన్నళగి అమ్మవార్లు. ఇక్కడి స్త్రీలు అందరూ కనుమ రోజున ఆభరణాలు ఏవీ ధరించరు. అంతేకాదు చేతులకు వేసుకున్న గాజులు, కాళ్లకు వేసుకున్న మెట్టెలు కూడా తీసేస్తారు. ఆ తర్వాత కేవలం తెల్ల చీర మాత్రమే కట్టుకొని, కుండ నెత్తిన పెట్టుకొని తమ కులదైవాల ఆలయాలకు వెళ్తారు. అక్కడ పొంగళ్లు ఉంచుతారు. ఇలా చేయడంలో ప్రత్యేక ఉద్దేశం ఉందని చెబుతారు అక్కడి వారు. దేవతల ముందు పేద, ధనిక అనే తేడా ఉండదని, అందరూ సమానమే అని చెప్పడమే ఈ ఆచారం ఉద్దేశమని చెబుతారు.
అమ్మవార్ల ఆలయాల ముందు చెరకుతో ఊయల కడతారు. అందులో నిమ్మకాయలు ఉంచి మొక్కులు చెల్లించుకుంటారు. పూజలు పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయలను అక్కడే వేలం వేస్తారు. మన దగ్గర గణపతి లడ్డూ మాదిరిగా వేలం నిర్వహిస్తారు. ఆ నిమ్మకాయలు దక్కితే కోరిన కోరికలు తీరుతాయని అక్కడివారి నమ్మకం. అలా నిర్వహించే వేలంలో ఒక్క నిమ్మకాయ దాదాపు రూ.40 వేలు పలుకుతుందట. ఇదేవిధంగా చెరకుగడ ఒక్కటి రూ.16 వేల పైచిలుకు పలుకుతాయట.
సేలం జిల్లా కూడా :
సేలం జిల్లాలోని నత్తకరై అనే గ్రామంలో 300 సంవత్సరాల నాటి పురాతన "నల్లసేవన్" ఆలయం ఉంది. ఇక్కడ ఐదేళ్లకోసారి ప్రత్యేక ఉత్సవాలు ఉంటాయి. సంక్రాంతి పండగ రోజున గ్రామ ప్రజలతోపాటు చుట్టుపక్కల ఊళ్లకు చెందిన పెళ్లైన స్త్రీలు వితంతు వేషం వేస్తారు. ఇలా సూర్యోదయానికి ముందే తమ కులదైవాలకు పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించుకుంటారు.
ఆడపిల్లలతో కుమ్మీ :
పుదుకోట్టై జిల్లాలోని సెరియలూర్ ఊళ్లో ఆడపిల్లలు బతుకమ్మ తరహాలో "కుమ్మీ" అనే జానపద నృత్యం ఆడుతారు. రజస్వల కాని పిల్లలు మొదట వ్రతం చేస్తారు. ఆ తర్వాత సంక్రాంతి రోజున పొంగళ్లు వండుతారు. వాటితోపాటు పువ్వులు, బెల్లం, చెరకు, వేప తదితర పదార్థాలను వెదురు బుట్టలో ఉంచి, దాన్ని తలపై పెట్టుకొని ఊరేగింపుగా బయల్దేరుతారు. సమీప అడవిలో ఉన్న "రాకాచ్చి" అమ్మవారి దగ్గర ఆ బుట్టలను ఉంచి, కుమ్మీ ఆడుతారు. ఆ తర్వాత పొంగలిని మాత్రం తాము తీసుకొని, మిగిలిన వాటన్నింటినీ గొయ్యి తీసి పూడుస్తారు. పూర్వకాలంలో పొంగు సోకిన ఒక అమ్మాయి పాలచెట్టుపై నుంచి కిందపడి మరణించిందట. అలా ఇంకెవరికీ జరగకూడదని అప్పట్నుంచి పొంగల్ నాడు "అమ్మవారి వ్యాధి"ని నివారించే మూలికలతో ఈ పండుగ చేయడం సంప్రదాయంగా వస్తోందట.