People facing problems by Incomplete Road in Hanamkonda District :హనుమకొండ జిల్లా పరకాల మండలంలో నాగారం తాటి వనం నుంచి వెంకటాపూర్, హైబోతుపల్లి మీదుగా భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం చింతలపల్లి వరకు నూతన బీటీ రోడ్డు మంజూరు చేశారు. సదరు గుత్తేదారు రోడ్డును తవ్వి కంకరపోసి వదిలేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డుపై నడవాలంటే నరకం చూస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు వేరే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'ఆరు నెలల క్రితం మంచిగా ఉన్న రోడ్డును తీసి, కంకర పోసి వదిలిపెట్టారు. దీన్ని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పందించి సకాలంలో రోడ్డు పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నాం. రాత్రి వేళలో సరిగా కనిపించక స్లిప్ అయ్యి చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు అసంపూర్తిగా ఉండటంతో పాటు కంకర రాళ్ల వల్ల ఇప్పటికే చాలా మంది గాయపడ్డారు.'- స్థానికులు
People Demanding for New Road :నాగారం తాటివనం నుంచి చింతలపల్లి వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర కంకర పోసి అలానే వదిలేయడంతో నడవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. నిత్యావసరాల కోసం పరకాల వెళ్లాలంటే ఇదే ప్రధాన దారి అని, ఈ రోడ్డుపై ప్రయాణించిన చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు గుండా ప్రయాణించాలంటే నరకం చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకొని వెంటనే రోడ్డు పనులు పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.