Fake Medicine inHyderabad :కల్తీ కాటు బారిన పడితే ఆరోగ్యానికి పెనుముప్పు. మరి ఆ ఆరోగ్యాన్ని కాపాడే ఔషధాలే నకిలీ, నాసిరకమయితే. ఇవి పుకార్లు కాదు చేదునిజం. సరిహద్దులు దాటి హైదరాబాద్ నగరానికి నకిలీ ఔషధాలు తరలివస్తున్నాయి. కొన్ని ముఠాలు గుట్టుగా కొన్ని మెడికల్ దుకాణాలతో సంబంధాలు పెట్టుకొని నకిలీ మందులు అమ్ముతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, ఇతర క్లిష్టమైన రోగాలకు సంబంధించి ఖరీదైన మందులను పోలిన నకిలీ మందులు తెచ్చి అమ్ముతున్నారు.
గుట్టుగా నకిలీ ఔషధాల విక్రయాలు : షీట్‌పై పేర్లలో అక్షరాలను అటూ ఇటూ చేయడం, ప్యాకింగ్‌లో తేడా కన్పించకపోయేసరికి రోగులు గుర్తుపట్టడం లేదు. పెద్ద మొత్తంలో మందులు, ఇంజక్షన్ల ప్యాకెట్లు కొనేటప్పుడు వాటిలో ఒకటి రెండు నకిలీవి కలిపి అమ్మేస్తున్నారు. నగరంలో ఔషధ నియంత్రణ శాఖ ఇటీవల 8 కేసులు నమోదు చేసి, పోలీసుల సహకారంతో కొంత మందిని అరెస్ట్ చేసింది.
గోలీల్లో ఔషధానికి బదులు సుద్ద పిండి :నకిలీ ఔషధాల కారణంగా రోగాలు మానక పోగా సమస్య మరింత పెరుగుతోంది. మందుల విషయంలో ఎంతో కొంత తెలిసి ఉంటే తప్ప వీటిని గుర్తించడం కష్టం అవుతోంది. కొన్ని ముఠాలు గోలీల్లో ఔషధానికి బదులు సుద్ద పిండి పెట్టి ప్యాక్ చేసి అమ్ముతున్నారు. గుజరాత్, పుణేలాంటి చోట్ల వీటిని తయారు చేసి, దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. శివార్లు, బస్తీల్లోని కొన్ని మెడికల్ షాపులను ఎంచుకొని ఈ ముఠాలు అక్రమ దందా చేస్తున్నాయి. దుకాణదారులకు భారీ ఎత్తున కమీషన్లు ఇవ్వడంతో ఈ వ్యాపారంలో దిగుతున్నారు. దీంతో నోట్లో వేసుకున్న మందు, ఒంటికి రాసుకున్న ఆయింట్‌మెంట్ పని చేస్తోందో లేదోననే ప్రజలు ఆందోళన పడుతున్నారు.