తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇకపై అన్ని ఆలయాల్లో ఆ నెయ్యి మాత్రమే వాడాలి : దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు - VIJAYA DAIRY GHEE SUPPLY TEMPLES

లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి విషయంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం - విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఈవోలకు ఆదేశం

vijaya dairy ghee to all temples
Endowment Department On Use Of Ghee In Temples (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 7:17 AM IST

Endowment Department On Use Of Ghee In Temples : రాష్ట్రంలోని ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి విషయంలో దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని ఆలయాల్లో ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ డెయిరీ నెయ్యినే వాడాలని ఈవోలను ఆదేశించింది. ఇప్పటికే అమల్లో ఉన్న పలు ఒప్పందాలను రద్దు చేయాలని తెలిపినట్లు సమాచారం. దీంతో యాదగిరిగుట్ట సహా పలు దేవాలయాల్లో కొత్త సంవత్సరం నుంచి విజయ నెయ్యిని లడ్డూలు, ప్రసాదాల్లో వాడేందుకు సిద్ధమవుతున్నారు.

3 నెలల ముందే నిలిపివేత :గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి వాడే నెయ్యి టెండర్లలో వివాదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ స్పందించింది. విజయ నెయ్యినే వాడాలని ఆగష్టు 22న ఆదేశాలు ఇచ్చింది. కొన్ని ఆలయాల్లో మాత్రం పాత గుత్తేదారుల నుంచే నెయ్యిని తీసుకుంటున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఏకంగా ప్రైవేట్ డెయిరీకి కట్టబెట్టారు.

భద్రాచలంలో నెయ్యి ప్రైవేటుకే :దీనిపై భద్రాచలంలో నెయ్యి ప్రైవేటుకే అని డిసెంబరు 16న ఈనాడులో కథనం వచ్చింది. దీంతో భద్రాచలం ఆలయ ఈవోకు మెమో జారీ చేశారు. అన్ని ఆలయాల ఈవోలతో సమావేశం నిర్వహించాలని కమిషనర్ శ్రీధర్​ను దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఆదేశించారు. దీంతో ఈవోలతో ఆన్​లైన్​లో సమావేశం నిర్వహించిన కమిషనర్, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయ నెయ్యినే వాడాలని తెలిపారు. అయితే చాలా దేవాలయాలు 2025 మార్చి వరకు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ 3 నెలల ముందే ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిసింది.

యాదగిరిగుట్టలో నెయ్యి సరఫరా : యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి జనవరి 1 నుంచి నెయ్యి సరఫరా చేయాలని ఈవో విజయ డెయిరీని కోరారు. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పాలను సేకరిస్తున్న ఓ డెయిరీ చాలా సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి నెయ్యి సరఫరా చేస్తోంది. అయితే మార్చి వరకు ఉన్న ఒప్పందాన్ని కొనసాగించాలని ఒత్తిళ్లు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రెండు డెయిరీల నుంచి 50-50 శాతం చొప్పున తీసుకోవాలని దేవాదాయ శాఖలో ఓ కీలక అధికారి ప్రతిపాదించినట్లు సమాచారం. ‘విజయ’ నెయ్యిని మాత్రమే తీసుకోవాలని దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొందరు రాష్ట్ర స్థాయి అధికారులు కొత్త ప్రతిపాదన తెస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

జనవరి 1న ఈ ఆలయాలను దర్శిస్తే - 2025 మొత్తం అదృష్టం వరిస్తుందట!

యాదాద్రి 'లడ్డూ' రిజల్ట్స్​ వచ్చేశాయ్ - స్వచ్ఛత పరీక్షల్లో ఏం తేలిందంటే?

ABOUT THE AUTHOR

...view details