Cancer Symptoms in Telugu: ప్రస్తుతం క్యాన్సర్ చిన్నాపెద్దా తేడా అందరిలోనూ వస్తుంది. ముఖ్యంగా మనదేశంలో ప్రతి సంవత్సరం 14 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతుండగా.. 9 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. దీనిని తొలిదశలో గుర్తించటం, త్వరగా చికిత్స చేయటం ద్వారా మూడింట ఒక వంతు మరణాలను ఆపొచ్చని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల క్యాన్సర్ మీద అవగాహన కలిగుండటం, లక్షణాలు గురించి తెలుసుకొని ఉండాలని సూచిస్తున్నారు. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- శరీరంలో ఎక్కడైనా అకస్మాత్తుగా గడ్డలు పెరగటం. క్యాన్సర్ గడ్డలు చాలావరకూ నొప్పి పుట్టవు. సమస్య తీవ్రమయ్యేకొద్దీ సైజు పెరుగుతుంటాయి.
- తరచుగా మలబద్ధకం, విరేచనాలు వేధించటం.
- మలద్వారం లేదా జననాంగం నుంచి అసాధారణ రక్తస్రావం కావటం.
- మలంలో, మూత్రంలో రక్తం పడటం.
- సంభోగ సమయంలో రక్త స్రావం, నెలసరి నిలిచిన తర్వాత రుతుస్రావం.
- చర్మం, గోళ్ల వెనకాల నుంచి రక్తస్రావం కావటం.
- మూత్రం ఆపలేకపోవటం, మూత్రం సరిగా రాకపోవటం, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి.
- మూడు వారాల కన్నా ఎక్కువగా గొంతు మారటం, మూడు వారాలు దాటినా దగ్గు తగ్గకపోవటం, దగ్గినప్పుడు రక్తం పడటం.
- గొంతులో, నోట్లో, ఎక్కడైనా మానని పుండ్లు.
- విడవకుండా ఛాతీమంట లేదా అజీర్ణం.
- పుట్టుమచ్చల సైజు పెరగటం, రంగు ముదరటం, దురద పెట్టటం, మచ్చల నుంచి రసి, రక్తం రావటం.
- చనుమొనల నుంచి రక్తం రావటం, రొమ్ము చర్మం అసాధారణంగా మందం కావటం, సొట్ట పడటం, రొమ్ములో గడ్డలు, వీటి సైజు పెరగటం.
- కడుపుబ్బరం, తినటం మొదలు పెట్టగానే కడుపు నిండినట్టుండటం, హఠాత్తుగా ఆకలి తగ్గటం.
- అకారణంగా కొద్దికాలంలోనే బరువు తగ్గటం.
- తీవ్రమైన నిస్సత్తువ, నీరసం. మగవారిలో రక్తహీనత.
- గొంతు వద్ద.. ముఖ్యంగా మగవారిలో థైరాయిడ్ గ్రంథి అసాధారణంగా ఉబ్బటం.
- ఆహారం మింగటంలో, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది.
- ఎముకల్లో తొలుస్తున్నట్టుగా నొప్పి. ఒంట్లో ఎక్కడైనా అసాధారణంగా నొప్పి వస్తూ పోతూ ఉండటం.
- చికిత్స తీసుకుంటున్నా చంకలు, గజ్జలు, మెడ వద్ద బిళ్లలు కట్టటం (లింఫ్ గ్రంథుల ఉబ్బు).
- రాత్రిపూట మరీ ఎక్కువగా చెమట పట్టటం.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజూ స్నానం చేయడం మంచిది కాదా? ఎన్ని రోజులకోసారి చేయాలి? నిపుణులు ఏం అంటున్నారంటే?
'రోజూ టిఫిన్ చేస్తే బరువు తగ్గుతారు'- బ్రేక్ఫాస్ట్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!