తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల చుట్టూ చెరువుల ఆక్రమణ - 'హైడ్రా'ను జిల్లాలకు విస్తరించాలంటున్న ప్రజలు - Encroachment of Pond in Jagtial - ENCROACHMENT OF POND IN JAGTIAL

Encroachment of Pond Land In Jagtial : చెరువులు కన్నతల్లులతో సమానం. వాటిని కాపాడుకుంటేనే భవిష్యత్‌ తరాలకు మనుగడ ఉంటుంది. కానీ అక్రమార్కులు కన్ను ప్రభుత్వ ఆధీనంలోనున్న చెరువులపైనే పడుతోంది. అధికారులు సైతం అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో హైడ్రా లాంటి వ్యవస్థ అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలనే వాదన వినిపిస్తోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో చెరువుల ఆక్రమణలపై ఈటీవీ ప్రత్యేక కథనం.

Encroachment of Pond Land in Jagtial
Encroachment of Pond Land in Jagtial (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 7:12 PM IST

Encroachment Of Pond Land In Jagtial : రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. కానీ నాడు వారు నిర్మించిన చెరువులు మాత్రం జగిత్యాల పట్టణానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాయి. అంతటి ఘనచరిత్ర కలిగిన చెరువులపై ఇప్పుడు కబ్జాదారుల కన్నుపడింది. జిల్లాకు ఆనుకుని ఉన్న మోతె చెరువు, కండ్లపల్లి, లింగం చెరువు, ధర్మసముద్రం, ముప్పాల చెరువు, చింతకుంట చెరువులు ఒకప్పటి మనుగడ కోల్పోతున్నాయి. కబ్జాదారుల కన్ను పడి సముద్రాలను తలపించే చెరువులు కాస్తా చిన్న నీటి కుంటల్లా తయారవుతున్నాయి. ఎక్కడ చూసినా వాటి చుట్టూ ఆక్రమణలే దర్శనమిస్తున్నాయి.

హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించాలి :జగిత్యాల పట్టణానికి అతిచేరువలో ఉండే మోతె చెరువు వాగు ఆక్రమించడంతో కొలనులోకి నీళ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కబ్జాదారులకు రాజకీయ అండదండలు ఉండటంతో పురపాలకశాఖ సైతం అనుమతులు ఇచ్చేస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఎఫ్‌టీఎల్‌ లెవల్‌లో నిర్మాణాలు ఆపాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు. హైదరాబాద్‌లో చెరువుల కబ్జాలపై కొరఢా ఝలిపిస్తున్న హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించి ఆక్రమణలు తొలగించాలని వారు కోరుతున్నారు.

'జగిత్యాలలో ఓ ఆరు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హైడ్రా అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ చెరువులకు సంబంధించి ఎఫ్‌టీఎల్‌ హద్దులు వేస్తే ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు అవకాశం ఉంది. గతంలో 90 ఎకరాల చెరువు ఆక్రమణలకు గురై 85 ఎకరాలకు వచ్చింది. అందువల్ల హైడ్రా అధికారులు చర్యలు తీసుకోవాలి' అని స్థానికులు కోరుతున్నారు.

జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న చెరువులను కాపాడాలంటే హైడ్రా ఒక్కటే మార్గమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. హైడ్రాను జిల్లాలకూ విస్తరిస్తే ఎంతో మేలు జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు తెలిపారు.

"జిల్లాలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. బఫర్ జోన్‌ పరిధిలో ఉన్న వాటినీ మట్టితో నింపేస్తున్నారు. మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్రమణలు కేవలం జంటనగరాలలోని చెరువులు , కుంటలకే పరిమితం కాకుండా జిల్లాల్లో కూడా జరుగుతున్నాయి. హైడ్రా పరిధిని రాష్ట్రమంతటా విస్తరింపచేస్తే మంచింది. అలా వీలుకానిచో తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకైనా సీఎం ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం" - జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ

హైదరాబాద్‌లో కబ్జాకు గురవుతున్న చెరువులు, నాలాలు - ఆక్రమణదారులపై కొరవడిన చర్యలు - Encroaching ponds and Lakes

ఇదేందయ్యా ఇదీ - నీళ్లు లేవని చెరువునే కబ్జా చేసేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details